దమ్ముంటే బిల్కిస్‌ బానోతో రాఖీ కట్టించుకో !

Telugu Lo Computer
0


నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌ సభ్యులందరూ ముస్లిం మహిళలతో రాఖీలు కట్టించుకోవాలంటూ పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే తీవ్ర విమర్శలు గుప్పించారు. ముస్లింల విషయంలో బీజేపీది, ఆ పార్టీ నేతలది ఎప్పుడైనా ద్వంద్వ వైఖరేనని మండిపడ్డారు. ఒక వైపు హిందూ, ముస్లింల మధ్య మతచిచ్చు రేపుతూనే మరోవైపు ముస్లింలపై ప్రేమ ఒలకబోయడం బీజేపీ నేతల కుటిల రాజకీయ నీతికి నిదర్శనమని ఉద్ధవ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్డీఏ సభ్యులంతా ముస్లిం మహిళలతో రాఖీలు కట్టించుకోవాలని ప్రధాని పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్న ఉద్ధవ్‌.. మోదీకి దమ్ముంటే 2002 అల్లర్ల సందర్భంగా సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్‌ బానో చేత రాఖీ కట్టించుకోవాలని సవాల్‌ విసిరారు. 2002లో గుజరాత్‌ అల్లర్ల సందర్భంగా సామూహిక అత్యాచారానికి గురైనప్పుడు బిల్కిస్‌ బానో వయసు 21 సంవత్సరాలు అని, అప్పుడు ఆమె గర్భవతి కూడా అని ఉద్ధవ్‌ గుర్తుచేశారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నేరగాళ్లంతా ఇప్పుడు జైలు నుంచి విడుదలై స్వేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నారని విమర్శించారు. ముస్లింలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని జైళ్ల నుంచి వదిలేసి, ఇప్పుడు ముస్లిం మహిళలతో రాఖీలు కట్టించుకోవాలని ఎన్డీఏ సభ్యులకు పిలుపునివ్వడం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. కాగా, 2002లో కరసేవకులతో వెళ్తున్న రైలుకు గోద్రాలో హిందూ వ్యతిరేకులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పలువురు కరసేవకులు సజీవదహనయ్యారు. దాంతో గోద్రాలో ఒక్కసారిగా మత ఘర్షణలు తలెత్తాయి. ఆందోళనకారులు ముస్లింల ఇళ్లలో చొరబడి దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఓ గుంపు బిల్కిస్‌ బానో ఇంట్లో చొరబడింది. ఆమె కుటుంబసభ్యులను దారుణంగా హతమార్చి, గర్భవతిగా ఉన్న ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో దోషులు శిక్ష అనుభవిస్తున్న 11 మందిని ఇటీవల సత్ప్రవర్తన పేరుతో జైలు నుంచి విడుదల చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)