అన్ని పార్టీలు కలిసి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి !

Telugu Lo Computer
0


కేంద్రంపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ కొనసాగుతోంది. మణిపూర్ అంశంపై గత కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విపక్షాలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఇందులో భాగంగానే ఎంపీలు అందరూ ఈనెల 11 వరకు సభ్యులు సభలకు తప్పనిసరిగా రావాలని విప్‌లు జారీ చేశాయి.మరోవైపు 10వ తేదీన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ సమాధానం ఇవ్వనున్నారు. విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చలో కేంద్రం తరఫున కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారు. దేశంలో జరిగిన అభివృద్ధి గురించి ఆయన ప్రస్తావించారు. 2014కి ముందు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రజలు ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో జాతి వివక్ష, దౌర్జన్యాలను ఎదుర్కొన్నారని, 2014 తర్వాత పరిస్థితి మారిపోయిందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి గౌహతిలో డీజీపీ సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతను పోలీసులు తప్పనిసరిగా చూసుకోవాలని ప్రధాని మోడీ ఆదేశించారని అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తన వాదనలు వినిపిస్తూ  ప్రమాదాలు దురదృష్టకరం, బాధాకరమని, ఒక్క రైలు ప్రమాదం జరిగితే ఒక్క ప్రాణం పోవడం కూడా తీరని విషాదమన్నారు. అయితే సంఖ్యలు తగ్గాయన్నారు. 2004 నుంచి 2014 వరకు సంవత్సరానికి 171 రైలు ప్రమాదాలు జరిగితే, అదే 2014 నుంచి 2023 వరకు 71కి తగ్గించబడ్డాయన్నారు. రైలు ప్రమాదాలు చాలా వరకు తగ్గాయన్నారు. ఒలింపిక్‌ క్రీడలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతంలో జరిగిన ఒలింపిక్‌ క్రీడల్లో భారత్ ఎలాంటి పతకాలు సాధించలేకపోయిందని.. 2020లో మాత్రమే దేశం మొదటిసారి ఏడు పతకాలు సాధించిందని అన్నారు. ఆటగాళ్లపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారని కేంద్ర మంత్రి చెప్పారు. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ గురించి కూడా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రస్తావించారు. “అమెరికా వంటి దేశాలు కూడా అంతరిక్ష ప్రాజెక్టులలో భారతదేశంతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాయి” అని ఆయన చెప్పారు. 2047 నాటికి అన్ని పార్టీలు కలిసి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు పిలుపునిచ్చారు. “మేము 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్నాము, కాబట్టి అమృత్‌కాల్ జరుపుకుంటున్నప్పుడు మాతో చేరండి. ఇది బీజేపీ లేదా ఎన్‌డీఏ కార్యక్రమం కాదు. ఇది దేశం కోసం ఉద్దేశించబడింది. 2047 నాటికి భారతదేశాన్ని సంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చే గొప్ప ప్రయాణంలో మనం కలిసి వెళ్దాం అని పార్టీ, ప్రభుత్వం నుండి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను” అని కిరణ్‌ రిజిజు అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)