జ్ఞానవాపిలో సైంటిఫిక్ సర్వేకు సుప్రీం కోర్టు అనుమతి

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సైంటిఫిక్ సర్వేకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది.మసీదులో సైంటిఫిక్ సర్వే చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే సర్వే సమయంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టవద్దని, మసీదు నిర్మాణాన్ని ధ్వంసం చేయొద్దని షరతు విధించింది. ఈమేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. 17వ శతాబ్దం నాటి జ్ఞానవాపి మసీదును హిందూ ఆలయం స్థానంలో నిర్మించారా? లేదా? అనేది తేల్చాలని.. ఇందుకోసం సైంటిఫిక్ సర్వే చేపట్టాలని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) కు సూచిస్తూ వారణాసి జిల్లా కోర్టు జులై 21న తీర్పు ఇచ్చింది. మసీదులోని 'వజుఖానా' మినహా మిగతా ప్రాంతమంతా సర్వే చేయాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. జిల్లా కోర్టు తీర్పును సమర్థించింది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్ ను గురువారం కొట్టేసింది. దీంతో మసీదు కమిటీ అదే రోజు సుప్రీంను ఆశ్రయించింది. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. ''నాన్-ఇన్వెసివ్ పద్ధతిలో సర్వే చేయాలి. ఎలాంటి తవ్వకాలు చేపట్టవద్దు. నిర్మాణాన్ని ధ్వంసం చేయొద్దు' అని ఆదేశించింది. ఏఎస్ఐ తమ సర్వే రిపోర్టును ట్రయల్ కోర్టుకు అందజేస్తుందని, దానిపై జిల్లా జడ్జి నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సైంటిఫిక్ సర్వే మొదలుపెట్టింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో శుక్రవారం ఉదయం 7 గంటలకు సర్వే ప్రారంభించింది. ఈ క్రమంలో మసీదు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, సర్వేకు మసీదు కమిటీ ప్రతినిధులు హాజరుకాలేదు. ''ఏఎస్ఐ టీమ్ ఉదయం 7 గంటలకు సర్వే ప్రారంభించింది. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు బ్రేక్ ఇచ్చారు. ఈ సర్వే ఐదారు రోజులు కొనసాగే అవకాశం ఉన్నది' అని హిందూ వర్గం తరఫు లాయర్లు చెప్పారు. ''అలహాబాద్ హైకోర్టు ఆర్డర్​ను మేం సుప్రీంలో సవాల్ చేశాం. సుప్రీం ఆర్డర్ వచ్చే వరకు సర్వే ఆపాలని సమాచారం ఇచ్చినా అధికారులు స్పందించలేదు. అందుకే సర్వేకు వెళ్లలేదు' అని మసీదు కమిటీ సెక్రటరీ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)