నడక మార్గంలో ప్రతీ 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు !

Telugu Lo Computer
0


తిరుమల అలిపిరి మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఎస్వీ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగం లక్షితను చంపేసింది చిరుతేనని తేల్చింది. రాత్రి చంపి శరీరంలోని భాగాలను చిరుత తిని వెళ్లిపోయిందని పోస్టుమార్టంలో తేలింది. దీంతో, అలిపిరి నుంచి తిరుమల కాలినడక మార్గంలో కొన్ని ఆంక్షలను విధించారు. అదే సమయంలో భక్తుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు సూచనలు చేశారు. తిరుమల మార్గంలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే చిన్నారిని చిరుత హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక అధికారులతో సమావేశం ఏర్పాటు చేసారు. పలు నిర్ణయాలు తీసుకున్నారు. చిన్నారి లక్షిత తప్పిపొయ్యిందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. 70 మంది భద్రతా సిబ్బంది బాలిక కోసం గాలించారన్నారు. నిన్న కాలిబాట మార్గంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారన్నారు. బాలిక ఒంటిరిగా కాలిబాట మార్గంలో రావడంతో తప్పిపొయ్యిందన్న కోణంలో విచారణ జరిపామని, ఎవరైనా బాలికను అపహరించారని ఊహించామని అన్నారు. బాలిక మృతి చెందడం హృదయ విధాకర ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. గాలిగోపురం నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు గుంపులు గుంపులుగా భక్తులను అనుమతిస్తున్నామని చెప్పారు. కాలిబాట మార్గంలో కంచె ఏర్పాటుపై ఫారెస్ట్ అధికారులను నివేదిక ఇవ్వమని ఆదేశించామన్నారు. కాలిబాట మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ ఈవో తెలిపారు. డీఎఫ్‌వో నేతృత్వంలో ఓ కమిటీని నియమించి  సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చెయ్యమని ఆదేశించామని చెప్పారు. గాలి గోపురం నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు అదనపు భద్రతను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాన్ని 6 గంటల లోపల మూసివేయ్యాలని ఫారెస్ట్ అధికారులు సూచించారని అన్నారు. టీటీడీ చైర్మన్‌ను సంప్రదించి కాలిబాట మార్గంలో ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. నడక మార్గంలో ప్రతీ 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఈవో చెప్పారు. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా చిరుత దాడిలో మరణించిల లక్షిత కుటుంబానికి అటవీ శాఖ నుంచి రూ 5 లక్షలతో పాటుగా టీటీడీ నుంచి రూ 5 లక్షలు..మొత్తంగా రూ 10 లక్షల మేర బాధిత కుటుంబానికి సాయం అందిస్తామని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. నడకదారిలో వచ్చే భక్తులు గుంపులుగా ..స్వామి వారి నామ స్మరణతో రావాలని ఈవో ధర్మారెడ్డి సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)