భార్య నిర్వహణ ఖర్చుల కింద ఇవ్వాల్సిన డబ్బును చిల్లర నాణేలు ఇచ్చిన భర్త !

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని జైపూర్‌ లో హర్మదా ప్రాంతానికి చెందిన దశరథ్‌ కుమావత్‌కు కొన్నేళ్ల కిందట సీమా అనే మహిళతో వివాహమైంది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టు ను ఆశ్రయించారు. ఈ కేసు కుటుంబ న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. అయితే భర్త నుంచి విడిగా ఉంటున్న సీమా కుమావత్‌కు ప్రతినెలా రూ.5వేలు నిర్వహణ ఖర్చుల కింద ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు దశరథ్‌ను ఆదేశించింది. కానీ, గత 11 నెలలుగా అతడు ఆ డబ్బులను ఇవ్వట్లేదు. దీంతో సీమా మళ్లీ కుటుంబ కోర్టును ఆశ్రయించగా అతడిపై న్యాయస్థానం రికవరీ వారెంట్‌ జారీ చేసింది. అయితే, ఆ డబ్బులు చెల్లించేందుకు దశరథ్‌ నిరాకరించడంతో పోలీసులు జూన్‌ 17న అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టుకు సెలవులు ఉండటంతో మంగళవారం అదనపు జిల్లా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. దశరథ్ అరెస్టు కావడంతో అతడి కుటుంబసభ్యులు సీమాకు చెల్లించాల్సిన డబ్బులను కోర్టుకు తీసుకొచ్చారు. అవన్నీ రూపాయి నాణేల్లో ఉండటం గమనార్హం. రూ.1, రూ.2 నాణేల రూపంలో మొత్తం రూ.55వేలను ఏడు సంచుల్లో తీసుకొచ్చారు. అయితే, ఈ డబ్బులను తీసుకొచ్చేందుకు సీమా నిరాకరించారు. తనను మానసికంగా వేధించాలని ఉద్దేశపూర్వకంగానే ఇలా నాణేలను తీసుకొచ్చారని ఆమె వాదించారు. అయితే, నాణేల రూపంలో దశరథ్ డబ్బులు చెల్లించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. కానీ, అందుకు ఓ షరతు విధించింది. అవన్నీ అతడే లెక్కించి ఇవ్వాలని ట్విస్ట్‌ ఇచ్చింది. ''ఈ కేసులో విచారణను జూన్‌ 26వ తేదీకి వాయిదా వేస్తున్నాం. అప్పటిదాకా ఈ డబ్బు కోర్టు కస్టడీలోనే ఉంటుంది. విచారణ తేదీ రోజున ఆ డబ్బును దశరథ్‌ లెక్కించి రూ.1000 చొప్పున ఒక్కో ప్యాకెట్‌గా విభజించాలి. ఆ ప్యాకెట్లను కోర్టులోనే భార్యకు అందజేయాలి'' అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో తలబాదుకోవడం దశరథ్‌ వంతైంది..!

Post a Comment

0Comments

Post a Comment (0)