మహారాష్ట్రలో రాజకీయ దుమారం లేపిన పత్రికా ప్రకటన !

Telugu Lo Computer
0


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మంగళవారం అనేక వార్తాపత్రికలలో 'దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మహారాష్ట్రకు ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే' అనే శీర్షికతో పూర్తి పేజీ ప్రకటనను ఇచ్చింది. రాష్ట్రంలో ఒక సర్వేను నిర్వహించింది. అందులో ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ కంటే షిండేకు ఎక్కువ మంది మద్దతు లభించిందట. ఆ అంశాన్ని ఊటంకిస్తూ  ఇచ్చిన పత్రికా ప్రకటన తాజాగా రాజకీయ వివాదానికి దారి తీసింది. ప్రకటనలో శివసేన ఎన్నికల గుర్తులైన విల్లు, బాణంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి షిండే చిత్రాలు ఉన్నాయి. అయితే ఈ ప్రటకనలో శివసేన వ్యవస్థాపకుడు అయిన బాలాసాహెబ్ థాకరే ఫోటో లేదు. విపక్ష పార్టీలేమో ఇలాంటి ప్రకటనలు గతంలో ఎప్పుడూ లేవని, షిండే నాయకత్వంలో ప్రకటనలు దిగజారుతున్నాయని మండిపడగా, ఇక బీజేపీ వర్గాలేమో దేవేంద్ర ఫడ్నవీస్‭ను కావాలని తక్కువ చేసి చూపిస్తున్నారంటూ మండిపడుతున్నాయి. శివసేన (యూబీటీ) అధినేత సంజయ్ రౌత్ ఈ ప్రకటనను ఉద్దేశిస్తూ 'నరేంద్ర మోడీ-అమిత్ షాల శివసేన' అని విమర్శించారు. 'ముఖ్యమంత్రి పదవి కోసం, మహారాష్ట్రలో 26.1 శాతం మంది ప్రజలు ఏక్‭నాథ్ షిండేను కోరుకోగా, 23.2 శాతం మంది ప్రజలు దేవేంద్ర ఫడ్నవీస్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు' అని ప్రకటనలో పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వంతో ప్రధాన భాగస్వామి అయిన ఫడ్నవీస్ గురించి ఉద్దేశపూర్వకంగా ఈ ప్రకటన వేశారని బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో మహారాష్ట్రలో 49.3 శాతం మంది ప్రజలు తమ రాష్ట్ర నాయకత్వం కోసం బీజేపీ, శివసేన మధ్య బలమైన కూటమిని చూడాలని కోరుకుంటున్నారని తేలిందట. 'ఎన్నికల సర్వేల ప్రకారం మహారాష్ట్ర పౌరులలో 30.2 శాతం మంది భారతీయ జనతా పార్టీని ఇష్టపడ్డారు. 16.2 శాతం మంది పౌరులు శివసేన(ఏక్‌నాథ్ షిండే)ను ఇష్టపడ్డారు. ఈ సంఖ్యలు మహారాష్ట్రలోని మొత్తం 46.4 శాతం మంది శివసేన-బీజేపీ కూటమిని విశ్వసిస్తున్నట్లు చూపిస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పొత్తు పెట్టుకున్నాయి'' అని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనపై ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన సంజయ్ రౌత్ స్పందిస్తూ 'ఇది గతంలో బాలాసాహెబ్ శివసేన. కానీ తాజా ప్రకటన అసలు విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు అది నరేంద్రమోదీ-అమిత్ షాల శివసేనగా మారింది. ప్రకటనలో దివంగత బాలాసాహెబ్ థాకరే చిత్రమే లేదు' అని అన్నారు. రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఫడ్నవీస్‌కు మహారాష్ట్ర ప్రజలు రెండవ ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అన్నారు. 'శివసేన, బీజేపీ మధ్య ఎవరు పెద్ద లేదా చిన్న పార్టీ అనే విషయంలో ఎటువంటి పోలిక లేదు' అని మరోనేత బవాన్‌కులే అన్నారు. కాంగ్రెస్ మహారాష్ట్ర యూనిట్ ప్రధాన అధికార ప్రతినిధి అతుల్ లోంధే దీనిని ''తప్పుడు సర్వే'' అని కొట్టిపారేశారు. షిండే తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి సర్వే పేరుతో ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారని అన్నారు. 'ఎన్నికలు ముగిసిన తర్వాత మహా వికాస్ అఘాడి 42 కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలను (మహారాష్ట్రలో), అసెంబ్లీలో 200 సీట్లను ఖచ్చితంగా గెలుచుకుంటుంది. 'ఒకప్పుడు ఏకనాథ్ షిండే ఉండేవాడు' అని ప్రజలు చెప్పుకుంటారు'' అని ఆయన అన్నారు. విపక్షాలపై విమర్శలపై షిండే వర్గంలోని చీఫ్ విప్ భరత్ గోగావాలే ఘాటుగానే స్పందించారు. 'మేము ఎవరికీ అనుకూలమైన సర్వేని చేయించలేదు. ఆయన (షిండే) ప్రజలకు కూడా అందుబాటులో ఉంటారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సందర్శిస్తారు. మా కోసం ఒక సర్వే నిర్వహించమని మేము ఏ మీడియా సంస్థను అడగలేదు' అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)