విదేశీయులకు అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్‌కూ చోటు !

Telugu Lo Computer
0


భారత్‌లో విదేశీయులకు అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్‌కూ చోటు లభించింది. దేశీయంగా చూస్తే ఈ జాబితా అగ్రస్థానంలో ముంబయి నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణె ఉన్నాయని 'మెర్సర్స్‌ 2023 కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సర్వే' చెబుతోంది. ప్రతి నగరంలో వసతి, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం వంటి 200 వరకు అంశాలకయ్యే వ్యయాలను పరిగణనలోకి తీసుకుని, ఈ జాబితా రూపొందించారు. ప్రపంచం మొత్తం మీద ఖరీదైన నగరాల్లో ముంబయికి 147వ స్థానం దక్కింది. దిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్‌ 202, కోల్‌కతా 211, పుణె 213వ స్థానాల్లో నిలిచాయి. అంతర్జాతీయంగా చూస్తే హాంకాంగ్‌, సింగపూర్‌, జూరిచ్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. చాలా తక్కువ ఖరీదైన ప్రాంతాల్లో హవానా (ఈ ఏడాది ఇది 83 స్థానాలు కోల్పోయింది), పాకిస్థాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్‌ ఉన్నాయి. ముంబయితో పోలిస్తే చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, పుణెల్లో వసతి ఖర్చులు 50 శాతం తక్కువగా ఉన్నాయి. విదేశీ ఉద్యోగులకు కోల్‌కతాలో అత్యంత తక్కువ వసతి ఖర్చులున్నాయి. అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో భారత నగరాల స్థానాల్లో మార్పులు కనిపించాయి. కరెన్సీ ఊగిసలాటలు, ఐరోపా వంటి ప్రాంతాల్లో వస్తువులు, సేవల ధరల్లో మార్పులు ఇందుకు కారణంగా నిలిచాయి. విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించుకోవాలనుకునే బహుళ జాతి కంపెనీ(ఎమ్‌ఎన్‌సీ)లకు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో షాంఘై, బీజింగ్‌, టోక్యోలతో పోలిస్తే ముంబయి (147), ఢిల్లీ (169) వ్యయాల పరంగా మంచి గమ్యస్థానాలుగా నిలుస్తున్నాయి. ఆసియాలో అత్యంత ఖరీదైన అగ్రగామి 35 నగరాల్లో ముంబయి, ఢిల్లీ నిలిచాయి. ఆసియా నగరాల్లో ముంబయి స్థానం గతేడాదితో పోలిస్తే ఒక స్థానం తగ్గి 27కు చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)