ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి చోటు లేదు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలను వైసీపీ నాయకులు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోన్నారు. విశాఖపట్నం, శ్రీకాళహస్తిల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో అమిత్ షా, జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వంపై వారిద్దరూ ఘాటు విమర్శలను సంధించారు. జగన్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. అవినీతి, కుంభకోణాల ఆరోపణలు ఉన్నాయని, వాటిపై తమకు ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లల్లో జగన్ సాధించింది అవినీతి, కుంభకోణాలు తప్ప మరేమీ లేదని ధ్వజమెత్తారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కేంద్రానికి సంబంధించినవేనంటూ అమిత్ షా తేల్చి చెప్పారు. పేదలకు అందజేస్తోన్న బియ్యాన్ని ప్రధాని మోదీ సరఫరా చేసినదేనని, కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న పథకాలపై జగన్‌ తన ఫొటో వేసుకుని ప్రచారం చేసుకుంటోన్నాడని అమిత్ షా ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బులతో జగన్ ప్రభుత్వం ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ మండిపడ్డారు. ఈ ఆరోపణలపై తాజాగా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి స్పందించారు.  ఆ పార్టీ నాయకులు ఎంత ప్రచారం చేసినా ఉపయోగం ఉండబోదని అన్నారు. ప్రచారం చేసుకోవడం బీజేపీకి కష్టమైందని వ్యాఖ్యానించారు. అందుకే ఢిల్లీ స్థాయి నుంచి నేతలను రప్పించుకుంటోన్నారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు ఏపీలో ఎక్కడికి వెళ్లినా రాష్ట్ర ప్రజలు వారిని నిలదీస్తోన్నారని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి కేటాయించాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీల గురించి ప్రజలు నిలదీస్తోన్నారని గుర్తు చేశారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించాలంటూ చేసిన ప్రతిపాదనలపై ప్రజలు ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తోన్నారని పేర్కొన్నారు. పాపం.. బీజేపీకి పోలరైజేషన్ పనిచేయదని సెటైర్లు వేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)