సుప్రీంకోర్టును ఆశ్రయించిన షమీ భార్య !

Telugu Lo Computer
0


టీమిండియా పేసర్‌ మహమ్మద్‌ షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ మరోసారి ఆరోపణలు చేశారు. షమీ తనను కట్నం కోసం వేధించేవాడని, ఇప్పటికీ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. అతడిపై నమోదైన క్రిమినల్‌ కేసు విచారణలో గత నాలుగేళ్లుగా ఎలాంటి పురోగతి లేదంటూ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతడి అరెస్టు వారెంట్‌పై ఉన్న స్టేను ఎత్తివేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. షమీ తనపై గృహహింసకు పాల్పడుతున్నాడని హసీన్‌ 2018లో కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ క్రమంలో 2019 ఆగస్టులో కోల్‌కతాలోని అలిపోర్‌ కోర్టు.. క్రికెటర్‌పై అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. అయితే దీన్ని షమీ సెషన్స్‌ కోర్టులో సవాల్‌ చేయగా.. అరెస్టు వారెంట్‌, క్రిమినల్ ప్రొసీడింగ్స్ పై స్టే విధిస్తూ సెషన్స్‌ కోర్టు తీర్పునిచ్చింది. సెషన్స్ కోర్టు ఉత్తర్వులపై హసీన్ జహాన్ ఈ ఏడాది మార్చిలో కోల్ కతా హైకోర్టును ఆశ్రయించింది. అరెస్ట్ వారెంట్ పై స్టే ఎత్తేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే హైకోర్టు స్టే ఎత్తివేసేందుకు నిరాకరించడంతో తాజాగా సుప్రీంకోర్టు మెట్లెక్కింది. గత నాలుగేళ్లుగా ఉద్దేశపూర్వకంగానే విచారణపై స్టేను కొనసాగిస్తున్నారని ఆమె పిటిషన్ లో పేర్కొంది. షమీ తనను కట్నం కోసం వేధించే వాడని, అతనికి ఎంతో మందితో వివాహేతర సంబంధాలున్నాయని, ఇప్పటికీ బీసీసీఐ టూర్లకు వెళ్లినప్పుడు ఆ సంబంధాలు కొనసాగిస్తున్నాడని హసీన్ ఆరోపించింది. షమీపై గృహహింస కేసు నమోదు చేసినప్పుడు.. ఖర్చుల కోసం భరణం కింద నెలకు రూ.10 లక్షలు ఇవ్వాలని హసీన్ జహాన్ కోర్టులో కేసు వేసింది. ఇందులో రూ.7లక్షలు తన ఖర్చులకు కాగా.. మిగతా రూ.3 లక్షలు కూతురి కోసమని చెప్పింది. ఈ పిటిషన్ పై గతంలో విచారణ జరిపిన కోల్‌కతా హైకోర్టు.. హసీన్‌కు షమీ నెలకు రూ.1.30లక్షల భరణం చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.50 వేలు ఆమె ఖర్చుల నిమిత్తం కాగా.. మిగతా రూ.80 వేలు వారి కుమార్తె పోషణ కోసం ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై అప్పట్లో హసీన్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)