రాజీనామా వెనక్కి తీసుకున్న శరద్ పవార్

Telugu Lo Computer
0


నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శరద్ పవార్ ఎట్టకేలకు తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఆయన రాజీనామా చేసిన అనంతరం రెండు రోజుల పాటు హైడ్రామా కొనసాగింది. పార్టీ కార్యకర్తలు, నేతలు రాజీనామాను తీవ్రంగా వ్యతిరేకించారు. విచిత్రంగా ఇతర పార్టీలు సైతం పవార్ రాజీనామాను వ్యతిరేకించాయి. దీంతో మంగళవారం రాజీనామా చేసిన పవార్.. శుక్రవారం సాయంత్రం సాయంత్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఎన్సీపీ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం స్వయంగా శరద్ పవార్ ఏర్పాటు చేసిన కోర్ కమిటీ సైతం పవార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం గమనార్హం. ఆయన స్థాపించిన పార్టీకి ఆయనే నాయకత్వం వహించాలని, అధ్యక్ష పదవిలో కొనసాగాలని కోరుతూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ విషయమై ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలనే శరద్ పవార్ కోరికను తాము ఏకాభిప్రాయంతో తిరస్కరించామని చెప్పారు. అంతే కాకుండా పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగాలని ఆయనను కోరాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే సహా పలు రాజకీయ పక్షాలు పవార్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. రాబోయే ఏడాది దేశ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా లౌకిక పార్టీలను ఏకం చేయాల్సిన అవసరం ఉందని, ఇలాంటి సమయంలో పవార్ రాజకీయాల్లో ఉండాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉందని ఆ నేతలు ముక్తకంఠంతో చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)