పశ్చిమ బెంగాల్‌లో హృదయ విదారక ఘటన !

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్‌ దినాజ్‌పూర్ జిల్లా కలియగంజ్‌ ప్రాంతం డంగిపారా గ్రామానికి చెందిన ఆసిం దేవశర్మ ఐదు నెలల క్రితమే కవలలకు తండ్రయ్యాడు. అయితే ఇటీవలే వారి ఆరోగ్యం క్షీణించింది. దీంతో చికిత్స కోసం ఇద్దరు పిల్లలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడి వైద్యులు రాయ్‌గంజ్ మెడికల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే వీరు మాత్రం సిలీగుడిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ పిల్లల ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఇంకా క్షీణించింది. దీంతో కవలల్లో ఒకరిని తీసుకుని తల్లి ఇంటికి వెళ్లిపోయింది. మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తన కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్సు ఏర్పాటు చేయాలని ఆస్పత్రి నిర్వాహకులను అడిగాడు దేవశర్మ. అయితే రూ.8,000 ఇవ్వాలని డ్రైవర్ డిమాండ్ చేశాడు. అంబులెన్సు రోగులను తరలించేందుకే ఉచితమని, శవాలను తరలించేందుకు కాదని బదులిచ్చాడు. కుమారుల చికిత్స కోసం ఆరు రోజుల పాటు రూ.16,000 ఖర్చు చేయడంతో దేవశర్మ వద్ద ఉన్న డబ్బంతా అయిపోయింది. ఇక గత్యంతరం కుమారుడి మృతదేహంతోనే సిలీగుడిలో ఓ ప్రైవేటు బస్సు ఎక్కాడు. రాయ్‍గంజ్‌లో దిగాడు. అక్కడినుంచి కలియగంజ్ వెళ్లేందుకు మరో బస్సు ఎక్కాడు. మొత్తం రూ.200 కిలోమీటర్లు ప్రయాణించాడు. చిన్నారి చనిపోయాడని తెలిస్తే బస్సు నుంచి దింపేస్తారని భయంతో ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. కలియగంజ్ చేరుకున్నాక తెలిసిన వ్యక్తి ఒకరు అంబులెన్సు ఏర్పాటు చేయడంతో దేవశర్మ అందులోనే ఇంటికి చేరుకున్నాడు. అనంతరం కుమారుడి అంత్యక్రియలు నిర్వహించాడు. తనకు జరిగిన విషయాన్ని మీడియాకు వెల్లడించడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పందిస్తూ ప్రతిపక్ష బీజేపీ.. టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనమని ధ్వజమెత్తింది. టీఎంసీ నేతలు ఈ విమర్శలను తిప్పికొట్టారు. చిన్నారి మరణం దురదృష్టకరమని , దీన్ని కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)