ప్రపంచ వేదికపై తెలంగాణ జల విజయం !

Telugu Lo Computer
0


ప్రపంచ వేదికపై తెలంగాణ సాధించిన జల విజయాన్ని చాటేందుకు తనకు అవకాశం లభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం, ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందిస్తున్న మిషన్‌ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణం, వాటి ఫలితాలను అమెరికా వేదికగా ప్రపంచానికి వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని నెవడా రాష్ట్రంలోని హెండర్సన్‌ నగరంలో ఈనెల 21 నుంచి 25 వరకు జరగనున్న 'అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీర్స్‌ (ఏఎస్‌సీఈ)- వరల్డ్‌ ఎన్విరాన్మెంటల్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ కాంగ్రెస్‌'లో ప్రారంభోపన్యాసం చేసేందుకు సంస్థ ఆహ్వానం మేరకు మంత్రి కేటీఆర్‌ అమెరికా వెళ్లారు. సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, ప్రభుత్వ ప్రణాళికల గురించి 2017లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో నగరం వేదికగా జరిగిన ఏఎస్‌సీఈ సదస్సులో మంత్రి కేటీఆర్‌ వివరించారు. ఈ భారీ పథకాల ప్రణాళికలపై నాడు ఆసక్తి ప్రదర్శించిన ఏఎస్‌సీఈ... 2022 సంవత్సరంలో తెలంగాణలో స్వయంగా పర్యటించింది. కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రత్యేకంగా సందర్శించిన ఆ సంస్థ ప్రతినిధుల బృందం, తెలంగాణ సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ గేమ్‌ ఛేంజర్‌ అని ప్రశంసించింది. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును స్వల్ప కాలంలోనే పూర్తి చేయడంపై ఆశ్చర్యం వ్యక్తంచేసిన ఏఎస్‌సీఈ బృందం... ఆ విజయగాథను, తెలంగాణ ప్రభుత్వ ఘనతను అమెరికాలో వివరించేందుకు రావాల్సిందిగా ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపించింది. అమెరికాలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి హాజరయ్యే సివిల్‌ ఇంజినీర్ల సమక్షంలో మంత్రి కేటీఆర్‌... సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, దాని ద్వారా అందుతున్న ఫలాలు, ఇతర ప్రణాళికలను ఒక దృశ్య రూపంలో అందించనున్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నీళ్లు అందిస్తున్న విధానం.. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన సామాజిక, ఆర్థిక ప్రగతిని కేటీఆర్‌ ఆవిష్కరిస్తారు. అమెరికా పర్యటనలో భాగంగా అక్కడి అయిదు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పలు కంపెనీలతో ఆయన సమావేశమవుతారు. ఈ నెల చివరి వారం వరకు కొనసాగే ఈ పర్యటనలో పలు అమెరికన్‌ కంపెనీలు తెలంగాణలో తమ పెట్టుబడుల ప్రకటనలను చేసే అవకాశముంది.

Post a Comment

0Comments

Post a Comment (0)