రెండో రోజుకు చేరుకున్న జన్ సంఘర్ష్ యాత్ర !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌ లో అవినీతి, పేపర్ లీక్స్‌ వంటి ప్రధాన అంశాలపై అజ్మీర్ నుంచి జైపూర్ వరకూ 125 కిలోమీటర్ల మేర కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ చేపట్టిన 'జన్ సంఘర్ష్ యాత్ర' శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాజస్థాన్ సీఎం అశోక్ హెహ్లాట్, పార్టీ అధినాయకత్వానికి ఈ పరిణామం ఒక సవాలుగా మారుతోంది. పైలట్ తొలిరోజు అజ్మీర్ నుంచి కిషన్‌గఢ్‌లోని టలమల్ వరకూ 25 కిలోమీటర్ల మేర యాత్ర సాగించారు. పైలట్ రెండో రోజు యాత్ర ప్రారంభిస్తూ, మే నెల కావడంతో ఎండలు మండుతున్నాయని, అయినప్పటికీ తాను లెవనెత్తిన అంశాల ప్రాధాన్యత కారణంగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని చెప్పారు. అవినీతి, యువతకు సంబంధించి సమస్యల ప్రభావం ప్రజలపై పడుతోందన్నారు. తాను లెవనెత్తిన అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. పైలట్ గురువారంనాడు యాత్రను ప్రారంభించేందుకు రైలులో అజ్మీర్ వచ్చారు. జైపూర్ హైవేపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం చేపట్టిన యాత్రలో వేలాదిమంది కార్యకర్తలు త్రివర్ణ పతాకాలతో, పైలట్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ పాల్గొన్నారు. వసుంధరా రాజే సారథ్యంలోని గత బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై చర్యలు తీసుకోవడంలో రాజస్థాన్ ప్రభుత్వం సాచివేత ధోరణి ప్రదర్శిస్తోందని యాత్ర ప్రారంభానికి ముందు పైలట్ చెప్పారు. మరోవైపు, రాజస్థాన్ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో తలెత్తిన సమస్యపై రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌చార్జి సుఖ్జిందర్ సింగ్ రాంధ్వా దృష్టిసారించారు. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ కో-ఇన్‌చార్జిలతో శుక్రవారం ఆయన సమావేశమవుతున్నారు. న్యూఢిల్లీలో జరిగే సమావేశంలో రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటాసర్ పాల్గొనే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)