పశ్చిమ మయన్మార్‌లో మోచా తుపాన్ బీభత్సం

Telugu Lo Computer
0


బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలను వణికించిన మోచా తుపాన్ ఆదివారం మధ్యాహ్నం తీరం దాటినప్పటికీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మయన్మార్ తీరం పొడుగునా 12 అడుగుల లోతు సముద్ర ఉప్పెన నీటిలో మునిగిన ప్రాంతాల నుంచి దాదాపు వెయ్యిమందిని సురక్షిత ప్రాంతాలకు సోమవారం తరలించారు. తుపాన్ కారణంగా ఆరుగురు మృతి చెందగా, 700 మంది గాయపడ్డారు. కమ్యూనికేషన్లు దెబ్బతిన్నాయి. ఆదివారం మధ్యాహ్నం రఖినే రాష్ట్రంలో పది లోతట్టు ప్రాంతాల్లో సముద్రం నీరు చొచ్చుకురావడంతో అక్కడి ప్రజలు ఇళ్ల పైకప్పుల పైకి, ఎత్తయిన అంతస్తుల లోకి, చేరుకోవలసి వచ్చింది. దాంతో సిట్వే టౌన్‌షిప్‌లో దాదాపు 20 వేల మందిని మఠాలు, పాఠశాలలు, గోపురాల భవనాల్లో ఆశ్రయం కల్పించామని సిట్వే లోని రఖినే యూత్స్ ఫిలాంత్రోఫిక్ అసోసియేషన్‌కు చెందిన సహాయకులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో సోమవారం కూడా ఐదు అడుగుల లోతులో వరదనీరు నిల్చి ఉంది. వరద ముంపు ప్రాంతాల ప్రజలను తరలించడానికి సహాయం చేయాల్సిందిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని , పౌరసేవా సమాజాలను అసోసియేషన్ అభ్యర్థించింది. రఖినే రాష్ట్రంలో 17 టౌన్‌షిప్‌లకు రాష్ట్ర అధికార యంత్రాంగం విపత్తు హెచ్చరికలు జారీ చేసింది. సిట్వే, క్యాయుపైయు , గ్వా టౌన్‌షిప్‌ల్లో ఇళ్లు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, బాదా దెబ్బతిన్నాయని మయన్మార్ మిలిటరీ కార్యాలయం వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)