ద్వేషపూరిత ప్రసంగాలపై కేసులు నమోదు చేయండి !

Telugu Lo Computer
0


ద్వేషపూరిత ప్రసంగం దేశ సెక్యులరిజాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలాంటి ప్రసంగం చేసిన వ్యక్తి కులం, వర్గం, మతంతో సంబంధం లేకుండా చట్టాన్ని ఉల్లంఘించేందుకు ఎవరినీ అనుమతించబోమని కోర్టు స్పష్టం చేసింది. ద్వేషపూరిత ప్రసంగాలపై ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ కేసులు నమోదు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. 2022లో కేవలం మూడు రాష్ట్రాలకు వర్తించే తీర్పు పరిధిని శుక్రవారం ఈ మేరకు పొడిగించింది. ద్వేషపూరిత ప్రసంగాలపై కేసులు నమోదు చేయడంలో జాప్యం చేస్తే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో విద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్ట్ షాహీన్ అబ్దుల్లా గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విద్వేష ప్రసంగాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగం ప్రకారం భారత్ లౌకిక దేశమని, మత తటస్థమని స్పష్టం చేసింది. 'మతం పేరుతో మనం ఎక్కడికి చేరుకున్నాం? మనం మతాన్ని ఏ స్థాయికి తగ్గించాం? అన్నది నిజంగా విషాదకరం' అని వ్యాఖ్యానించింది. ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారిపై మతాలకు అతీతంగా కఠినంగా వ్యవహరించాలని తొలుత ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ను ఆదేశించింది. మరోవైపు 2022 అక్టోబర్‌ 21న సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును దేశవ్యాప్తంగా వర్తింపజేయాలని కోరుతూ జర్నలిస్ట్ షాహీన్ అబ్దుల్లా మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్‌, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం దీనిపై శుక్రవారం విచారణ జరిపింది. నాటి ఆదేశాల పరిధిని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించింది. ఈ కేసు తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)