జైలులో మగ్గేలా చేయడానికి సీబీఐ ప్రయత్నిస్తోంది !

Telugu Lo Computer
0


ఢిల్లీ మద్యం విధానం కేసులో తనను జైలులో మగ్గిపోయేలా చేయడం కోసం సీబీఐ ప్రయత్నిస్తోందని ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు. ఈ కేసులో తన ప్రమేయంపై ఎటువంటి సాక్ష్యాలు లేవని, అందువల్ల తనకు బెయిలు మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును గురువారం కోరారు. సిసోడియా తరపున సీనియర్ అడ్వకేట్ దయన్ కృష్ణన్ వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో సీబీఐ పేర్కొన్న నిందితుల్లో సిసోడియాకు తప్ప మిగిలినవారందరికీ బెయిలు మంజూరైనట్లు తెలిపారు. సిసోడియా సాక్ష్యాధారాలను తారుమారు చేసినట్లు రుజువు చేసే సాక్ష్యాలేవీ సీబీఐ వద్ద లేవన్నారు. సిసోడియా దాఖలు చేసిన బెయిలు దరఖాస్తులో, ''నేను సహకరించడం లేదని వారు (సీబీఐ) చెప్తున్నారు. నాకు బెయిలు తిరస్కరించడానికి ఇది కారణం కాకూడదు. నేను సహకరించవలసిన, నేరాన్ని అంగీకరించవలసిన, లేదా వారి ప్రశ్నలకు వారు కోరుకున్న విధంగా సమాధానాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు. నేను నాకు కావలసినట్లుగానే సమాధానాలు చెప్పాలి. అది రాజ్యాంగం - ఇచ్చిన హామీ'' అని తెలిపారు. సిసోడియా తరపున మరో న్యాయవాది మోహిత్ మాథుర్ వాదనలు వినిపిస్తూ, సీబీఐ చెప్తున్న లెక్కలు కేవలం కాగితాలపైనే ఉన్నాయన్నారు. ఆర్థిక లావాదేవీలేవీ జరగలేదని చెప్పారు. ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి సిసోడియా అని, విజయ్ నాయర్ ద్వారా ఈ కుట్రను రూపొందించారని సీబీఐ ఆరోపిస్తోందన్నారు. నాయర్‌ను 2022 సెప్టెంబరులో అరెస్టు చేశారని, చార్జిషీట్ దాఖలు చేయకుండానే, నవంబరులో విడుదల చేశారని చెప్పారు. సిసోడియాను 2023 ఫిబ్రవరిలో రెండోసారి ప్రశ్నించేందుకు పిలిచారన్నారు. సాక్షులను సిసోడియా ప్రభావితం చేస్తారని ఆరోపించడం పూర్తిగా తప్పు అని తెలిపారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ బుధవారం జరుగుతుందని కోర్టు తెలిపింది. ఆ రోజున సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదనలు వినిపిస్తారు. ఎక్సయిజ్ పాలసీ ఏ విధంగా అమలైందో తెలియజేయాలని కోర్టు రాజును కోరింది. దీని గురించి వివరించేందుకు సీబీఐ దర్యాప్తు అధికారిని పిలవవచ్చునని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)