తమిళనాడు గవర్నర్ తీరుపై పార్టీలు మండిపాటు !

Telugu Lo Computer
0


తమిళనాడు లోని కూడన్‌కుళం అణువిద్యుత్‌ కేంద్రానికి, స్టెరిలైట్‌ కర్మాగారానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలకు విదేశీ నిధులు అందాయంటూ రాష్ట్ర గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలపై అన్నాడీఎంకే, బీజేపీ తప్ప మిగిలిన పార్టీలు మండిపడ్డాయి. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరించాయి. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. డీఎంకే లోక్‌సభ సభ్యురాలు కనిమొళి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్‌, సీపీఐ కార్యదర్శి ముత్తరసన్‌, కాంగ్రెస్‌ నేత గోపన్న, డీపీఐ అధినేత తిరుమావళవన్‌, ఎండీఎంకే నేత వైగో తదితరులు గవర్నర్‌ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు. ''తూత్తుకుడి ఆందోళనల వెనుక విదేశీ నిధులు వినియోగించారనేందుకు ఆధారాలుంటే ఇవ్వాలి. రవి గవర్నర్‌లా వ్యవహరించడం లేదు. నోరు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. బిల్లును తిరస్కరించే అధికారం గవర్నర్‌కు ఎక్కడుంది? స్టెరిలైట్‌, ఆన్‌లైన్‌ రమ్మీకి అనుకూలంగా గవర్నర్‌ మాట్లాడడం ఏమాత్రం సరికాదు. గవర్నర్‌ పదవికి, రవి మాట్లాడే మాటలకు సంబంధమే లేదు. శాసనసభలో ఆమోదించిన బిల్లులను నిరాకరించే అధికారం గవర్నర్‌కు లేదు. గవర్నర్‌ అభిప్రాయాలు ప్రమాదకరమైనవి. తొలినుంచి ఆయన తప్పుడు అభిప్రాయాలే వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను ఆయన అవమానిస్తున్నారు. గవర్నర్‌ను వెంటనే కేంద్రప్రభుత్వం రీకాల్‌ చేయాలి. రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్నారు. గవర్నర్‌ రవి పోటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. రాష్ట్ర శాసనసభలో నెరవేర్చిన బిల్లులను ఆమోదించకపోవడమంటే రాజ్యాంగధిక్కరణే. రాజ్యాంగాన్ని గవర్నర్‌ గౌరవించే పరిస్థితి లేదు. ఆయన వైఖరి పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం. గవర్నర్‌కు బయటకు పంపే వరకు పోరాడడం ప్రజాస్వామిక శక్తుల కర్తవ్యం. స్టెరిలైట్‌ ఆందోళనలకు విదేశీ నిధులు వినియోగించారనే గవర్నర్‌ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి పరాకాష్ట. దేశానికి వ్యతిరేకంగా విదేశీ నిధులు వినియోగిస్తున్నారని ఏ రాష్ట్ర గవర్నర్‌ కూడా మాట్లాడడు. ఆయన అత్యంత నీచమైన పదాన్ని స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా 30 ఏళ్లుగా పోరాడిన ప్రజల గుండెల్లో గవర్నర్‌ గునపం దింపారు'' అంటూ నేతలు తూర్పారబడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)