గౌతమ్‌ నవ్‌లఖా రూ.8 లక్షలు జమ చేయండి !

Telugu Lo Computer
0


ఎల్గార్‌ పరిషద్‌ - మావోయిస్టు సంబంధాల కేసులో అరెస్టై ఆరోగ్య కారణాల రీత్యా గృహ నిర్బంధంలో ఉన్న కార్యకర్త గౌతమ్‌ నవ్‌లఖా తన పోలీసు భద్రత ఖర్చుల కోసం మరో రూ.8 లక్షలు జమ చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. గతేడాది నవంబరు 10న గౌతమ్‌ గృహ నిర్బంధానికి ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం, పోలీసు భద్రత కోసం రూ.2.5 లక్షలు డిపాజిట్‌ చేయాలని అప్పట్లో ఆదేశించింది. ఇప్పటివరకు గౌతమ్‌ మొత్తం రూ.66 లక్షల మేర చెల్లించాల్సి ఉందని అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జే) ఎస్‌.వి.రాజు తాజాగా కోర్టుకు వివరాలు సమర్పించడంతో జస్టిస్‌ కె.ఎం.జోసఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం పైమేరకు ఆదేశాలిచ్చింది. ముంబయి లైబ్రరీలో గృహ నిర్బంధంలో ఉన్న తనను నగరంలోని వేరే ప్రదేశానికి తరలించాలన్న గౌతమ్‌ పిటిషన్‌పై రెండు వారాల్లో స్పందన తెలపాలని ఏఎస్‌జేను ధర్మాసనం ఆదేశించింది. తాను రోజూ 45 నిమిషాలు నడవడానికి వెసులుబాటు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని గౌతమ్‌ అభ్యర్థించారని ధర్మాసనం తెలపగా, ఆయనతో పాటు పోలీసులు కూడా నడవాల్సి వస్తుందని ఏఎస్‌జే తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ''పోలీసుల్లో చాలా మందికి ఫిట్‌నెస్‌ లేదు. నడిస్తే వారు ఫిట్‌గా తయారవుతారు. నిజానికి గౌతమ్‌ పోలీసులకు మంచే చేస్తున్నారు'' అని వ్యాఖ్యానించింది. గౌతమ్‌ నడకకు వీలుగా నిబంధనలు జారీ చేస్తున్నట్లు తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)