651 అత్యవసర మందుల ధరలు తగ్గింపు !

Telugu Lo Computer
0


అత్యవసరమైన 651 మందుల ధరలు తగ్గాయి. అత్యవసర మందుల జాబితాలో ఉన్న 651 మందుల ధరలపై కేంద్రం సీలింగ్ ధరను నిర్ణయించింది. దీంతో ఈ మందుల ధరలు దాదాపు 7 శాతం తగ్గనున్నాయి. తగ్గిన ధరలు ఏప్రిల్ నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఔషధాల నియంత్రణ సంస్థ నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ  ట్విట్టర్ వేదికగా సోమవారం వెల్లడించింది. అత్యవసర మెడిసిన్స్ జాబితాలో ఉండే 870 రకాల మందుల్లో 651 ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం సీలింగ్ ధరను నిర్ణయించింది. వాస్తవానికి ద్రవ్యోల్బణం కారణంగా వీటి ధరలు 12.12 శాతంపెరగాల్సి ఉన్నప్పటికీ.. ఈ సీలింగ్ నిర్ణయంతో వీటి ధరలు 6.73 శాతం దిగొచ్చాయి. ఏప్రిల్ 1 నుంచే ఈ ధరలు తగ్గాయి. దీంతో మందుల ధరల పెరుగుదల ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈ తగ్గింపుతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుందని ఎన్పీపీఏ తెలిపింది. జ్వరానికి ఉపయోగించే పారాసెటమాల్, యాంటీ డయాబెటీస్ మందులు మెట్ ఫార్మిన్, గ్లిమెపిరైడ్, టెల్మిసార్టాన్, యాంటీ బయోటిక్ మందైన అమోక్సిలిన్, క్లాపులానిక్ యాసిడ్ వంటి మందుల ధరలు తగ్గాయి. ఎక్కువ మంది ప్రజలు వినియోగించే అత్యవసర మందులతో కేంద్ర ఆరోగ్యశాఖ ఓ జాబితాను రూపొందించింది. ఆ జాబితాలో మొత్తం 870 రకాల ఔషధాలున్నాయి. అయితే, ఈ మందుల టోకు ధరల సూచీ ఆధారంగా ఏప్రిల్ 1న ఈ ధరలను సవరిస్తుంటారు. 2022 సంవత్సరానికి గానూ ఈ సూచీ 12.12 శాతం పెరిగింది. దీంతో షెడ్యూల్డ్ మందుల పరిధిలోకి వచ్చే 857 రకాల మందులను 12.12 పెంచుతూ ఎన్పీపీఏ నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేంద్రం కూడా ఆమోదం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా, ఈ జాబితాలోని అత్యధికంగా 651 మందుల ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)