వాళ్లకి భజనపరులే కావాలి !

Telugu Lo Computer
0


గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని, ఏనాడూ ప్రజాస్వామ్య విలువలు ఇంతలా దిగజారలేదని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా దారుణమని, ఎంతో మంది పెద్ద నేతలతో పనిచేశానని, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ పార్టీ నుంచి వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ''ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచే ప్రశ్నిస్తూ వచ్చాను. ప్రశ్నించే గొంతుక అంటే ఏ రాజకీయ పార్టీ అయినా దాన్ని సద్విమర్శగా తీసుకుని మంచి చేసేందుకు ప్రయత్నం చేయాలి. కానీ అధికారంలోని పార్టీ ప్రశ్నించే గొంతుకను తొక్కేయడం, నలిపివేయడం చేస్తోంది. రాష్ట్రంలో, మా జిల్లాలో జరిగే దోపిడీ వ్యవస్థలపై ప్రశ్నించాను.. విమర్శించాను. అభివృద్ధి నిలిచిపోయిందని.. అరాచకకాలు జరుగుతున్నాయని చెప్పాను. ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలు జరగడంలేదని గత నాలుగు నెలలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. అందుకే నన్ను పక్కన పెట్టి నా నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిని ఇన్‌ఛార్జ్‌గా పెట్టారు. నాకు సహకరించవద్దని జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు సీఎంవో నుంచి కూడా ఫోన్లు వచ్చాయి. ఆఖరికి నా భద్రతను కూడా తగ్గించారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని వ్యక్తులతో నాలుగేళ్లు నడిచినందుకు బాధపడుతున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలను అడ్డుపెట్టుకుని ఈ విధంగా చేశారు. మీరేమైనా అనుకోండి.. మేం అనుకున్నదే చేస్తాం అన్నట్లుగా వారి వ్యవహారశైలి ఉంది. అటువంటి సలహాదారుల సలహాలతో నడిచే ప్రభుత్వం మనుగడ భవిష్యత్తులో ప్రశ్నార్థకం అవుతుంది. మేం అమ్ముడు పోయామంటూ కొందరు చేసిన ఆరోపణలను మీడియాలో చూశాం. మాపై విమర్శలు చేసిన ప్రభుత్వ సలహాదారు రూ.వేలకోట్లు ఎలా సంపాదించారో మేం చూశాం. ఆయనలాగే అందరూ ఉంటారని అనుకుంటున్నారు. రాజకీయ జీవితంలో ఇలాంటి నిందలు, ఆరోపణలు సహజం. మా గురించి తెలిసిన వారు వాటిని విశ్వసించరు. ఇలాంటి చిల్లర వ్యవహారాలకు మేం పాల్పడ్డామని భావిస్తే అది వాళ్ల ఖర్మే. క్రాస్‌ ఓటింగ్‌ను నిర్ధారించడం సీక్రెట్‌ బ్యాలెట్‌లో సాధ్యం కాదు. అంత పటిష్ఠమైన చట్టం ఉంది. మనల్ని విమర్శించే వారిని బయటకు పంపడమెలా అని ఆలోచించి ఈ విధంగా సస్పెండ్‌ చేశారు. మా ప్రభుత్వంలో అంతా ఏకఛత్రాధిపత్యమే. పూర్వం చక్రవర్తులు, రాజుల పాలన తరహా జరుగుతోంది. భజనపరులే కావాలనుకునే మనస్తత్వం వారిది. రాజకీయ అహంకారపూరిత ధోరణితో ఉన్న వ్యవస్థలో మమ్మల్ని ఉంచుకోవడం వారికి ఇష్టం లేదు. ఇతర ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్య విలువలతో పాటు పార్టీలోని వ్యక్తులను గౌరవించేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా. నా కుటుంబసభ్యులు ఎవరు రాజకీయాల్లోకి వస్తారనేది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది'' అని ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)