టీఆర్‌ఎస్‌ ఆఫీసులో 'ఏపీ' అనే వ్యక్తికి రూ.75 కోట్లు ఇచ్చా !

Telugu Lo Computer
0


రూ.200 కోట్ల మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయ్యి, ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్‌ జైలులో ఉన్న సుఖే‹æ చంద్రశేఖర్‌ మరో బాంబు పేల్చాడు. 2020లో హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో 'ఏపీ' అనే వ్యక్తికి రూ.75 కోట్లు అందజేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్, అప్పటి ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ తనను ఆదేశించారని వెల్లడించాడు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో భాగస్వామి అయిన 'ఏపీ' అనే వ్యక్తికి టీఆర్‌ఎస్‌ ఆఫీసులో రూ.75 కోట్లు అందజేశానని తెలియజేశాడు. ఒక్కో పెట్టెలో 15 కిలోల నెయ్యి (కోడ్‌ భాషలో రూ.15 కోట్లు) ఉందని, మొత్తం 5 పెట్టెలు (రూ.75 కోట్లు) హైదరాబాద్‌లో సిద్ధంగా ఉన్నట్లు కేజ్రీవాల్‌ తనతో చెప్పారని, ఆయన ఆదేశాల మేరకు వాటిని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో సంబంధిత వ్యక్తికి చేరవేశానని స్పష్టం చేశాడు. సదరు వ్యక్తి టీఆర్‌ఎస్‌ ఆఫీసు ప్రాంగణంలో రేంజ్‌ రోవర్‌ కారులో కూర్చొని ఉండగా డబ్బులు అందజేశానని తెలిపాడు. ఈ మేరకు సుకేశ్‌ శుక్రవారం తన న్యాయవాది అనంత్‌ మాలిక్‌ ద్వారా ఒక లేఖ విడుదల చేశాడు. 2020లో తనకు, కేజ్రీవాల్‌కు మధ్య నడిచిన చాటింగ్‌ గురించి సుఖేశ్‌ చంద్రశేఖర్‌ ఇందులో ప్రస్తావించాడు. కేజ్రీవాల్‌ కరడుగట్టిన అవినీతిపరుడని, ఆయన బాగోతం మొత్తం బయటపెడతానని లేఖలో పేర్కొన్నాడు. ఇది ట్రైలర్‌ మాత్రమేనని.. తాను, కేజ్రీవాల్‌ పరస్పరం పంపించుకున్న సందేశాలను బహిర్గతం చేస్తానని వెల్లడించాడు. 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్‌ చాటింగ్‌ తన వద్ద ఉందన్నాడు. తాను బయటపెట్టే నిజాలతో కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోవడం ఖాయమని వ్యాఖ్యానించాడు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒక జోక్‌గా మారిపోతున్నాయని ఎద్దేవా చేశాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)