రూ.300 కోసం హత్య చేసిన వ్యక్తికి యావజ్జీవం

Telugu Lo Computer
0


రూ.300 కోసం క్షణికావేశంలో బావ మరణానికి కారణమైన బావమరిదికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు, రూ.2,500 జరిమానా విధిస్తూ విశాఖలోని 12వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.గోవర్ధన్‌ మంగళవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించలేని పక్షంలో అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వి.దేవానందరావు(నంద), యలమంచిలి రూరల్‌ ఎస్‌ఐ సన్నిబాబు అందించిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్ లోని యలమంచిలి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి పోతిరెడ్డిపాలెం హైవే జంక్షన్‌ వద్ద బీహర్‌ రాష్ట్రం గయ జిల్లాకు చెందిన మృతుడు శైలేష్‌సింగ్‌ భార్య సునీతాదేవితో కలిసి ఒక దాబా నిర్వహించేవారు. శైలేష్‌ బావమరిది, నిందితుడు రామ్‌నాథ్‌సింగ్‌ కూడా రోజువారీ కూలీగా దాబాలో పనిచేసేవాడు. శైలేష్‌ తన వ్యక్తిగత పూచీతో నిందితుడికి రూ.30 వేలు అప్పుగా ఇప్పించాడు. ప్రతిరోజు సాయంత్రం ఫైనాన్స్‌ వారికి రామ్‌నాథ్‌సింగ్‌ జీతం నుంచి రూ.300 కట్టేవాడు. ఈ నేపథ్యంలో 2015 ఏప్రిల్‌ 20న శైలేష్‌ రూ.300 రామ్‌నాథ్‌కి ఇచ్చాడు. అయితే రామ్‌నాథ్‌ ఆ డబ్బులు ఎక్కడో పెట్టడంతో కనిపించలేదు. దీంతో శైలేష్‌ సింగ్‌ భార్య సునీతాదేవితో గొడవ పెట్టుకున్నాడు. అదే రోజు రాత్రి 9:30 గంటల సమయంలో దాబా పక్కనే ఉన్న, టైర్ల షాపులోకి వెళ్లి అక్కడ మహమ్మద్‌ ఇస్లాం సహకారంతో బలమైన ఇనుపరాడ్డును తీసుకుని శైలేష్‌ తలపై దాడి చేశాడు. అనంతరం ఆ రాడ్డుతో సహా బీహార్‌కు పారిపోయాడు. వెంటనే శైలేష్‌ భార్య అతనిని స్థానిక ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్సకు విశాఖలోని కేజీహెచ్‌కి తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శైలేష్‌ మృతి చెందాడు. అప్పట్లో సంచలనం రేపిన ఈ కేసును అప్పటి యలమంచిలి గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఎ.వెంకట్రావు దర్యాప్తు చేశారు. నిందితునిపై భారతీయ శిక్షాస్మృతి 302 కింద కేసు నమోదుచేసి చేసి నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)