అమెరికా గగనతలంలో గుర్తు తెలియని వస్తువు కూల్చివేత !

Telugu Lo Computer
0


అమెరికాలోని అలాస్కా గగనతలంలో ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువును అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు కూల్చేశారు. గత శనివారం అట్లాంటిక్‌పై ఎగురుతున్న చైనా గూఢచర్య బెలూన్ ను కూల్చేసిన సంగతి తెలిసిందే. ఈ బెలూన్ కన్నా ఈ వస్తువు పరిమాణం తక్కువ. శుక్రవారం కూల్చేసిన వస్తువు అలాస్కా గగనతలంలో దాదాపు 40 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ ఉండేది. ఈ ప్రాంతంలో జనాభా సుమారు 300 మంది ఉంటారు. ఈ గగనతలంలో ప్రయాణించే విమానాల భద్రతకు ఇది ముప్పుగా పరిణమించింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అంతుబట్టడం లేదు. ఇది మానవ రహిత వస్తువు అని వైట్ హౌస్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. గత వారం పేల్చేసిన బెలూన్ కన్నా ఇది చిన్న పరిమాణంలో ఉందని తెలిపారు. అలాస్కాలోని జాయింట్ బేస్ ఎల్మెండోర్ఫ్-రిచర్డ్‌సన్‌లో ఉన్న ఎఫ్-22 యుద్ధ విమానం AIM-9X షార్ట్ రేంజ్ గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణిని ప్రయోగించి ఈ వస్తువును కూల్చేసింది. దీంతో ఇది ముక్కలు చెక్కలు అయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)