ఆటోను ఢీకొన్న జనరేటర్‌ వ్యాన్‌ : ఇద్దరు కూలీలు మృతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి, గరువుపాలెం గ్రామాల వద్ద సోమవారం జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాపట్ల జిల్లా చుండూరు మండలం దిండుపాలెం గ్రామానికి చెందిన 11 మంది కూలీలతో కూడిన ఆటో చేబ్రోలు మండలం నారాకోడూరు వైపు వస్తోంది. మరోవైపు జనరేటర్‌ తగిలించుకుని వ్యాన్‌ ఒకటి నారాకోడూరు నుంచి తెనాలి వైపు వెళుతోంది. దారిలో జనరేటర్‌కు కట్టిన తాడు తెగిపోయింది. వ్యాన్‌ ముందుకెళ్లిపోగా నియంత్రణ లేని జనరేటర్‌ ఎదురుగా వస్తున్న కూలీల ఆటోను బలంగా ఢీకొంది. ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జయిపోగా అందులో ప్రయాణిస్తున్న పిట్టు వెంకట రమణ (46), తుమ్మా సామ్రాజ్యం (26) అక్కడికక్కడే చనిపోయారు. జంగం మరియమ్మ, లంకా లక్ష్మీ, క్రీస్తు కుమారిలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మిగతావారు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. బాధితులు నారాకోడూరు పరిసర గ్రామాల్లో కోతల పనులకు వస్తూ ప్రమాదం బారిన పడడంతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది. చేబ్రోలు మండలం సుద్దపల్లిలో ఆదివారం రాత్రి మారెమ్మ తల్లికి ప్రభలు కట్టారు. విద్యుత్‌ దీపాలంకరణ కోసమని తెనాలి నుంచి జనరేటర్‌ అద్దెకు తీసుకెళ్లారు. సోమవారం నాంచారయ్య అనే వ్యక్తి దానిని తన వ్యాన్‌కు తగిలించుకుని తిరిగి తెనాలి తీసుకెళుతుండగా గరువుపాలెం వద్ద తాడు తెగి ప్రమాదానికి కారణమైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)