చైనాతో యుద్ధంలో ఎలా గెలువగలం ?

Telugu Lo Computer
0


'చైనాది పెద్ద ఎకానమీ, మనది చిన్న ఎకానమీ. వాళ్లతో మనం యుద్ధంలో ఎలా గెలువగలం? ఇది కనీస జ్ఞానంతో ఆలోచించాల్సిన అంశం. సరిహద్దుల్లో భారీగా సేనలను మోహరించరాదని మనకు వారితో ఒప్పందం ఉన్నది. మేం అలాగే చేస్తున్నాం. సరిహద్దుల్లో పరిస్థితిని స్థిరంగా ఉంచి, మన ప్రయోజనాలు కాపాడేందుకే ఇలా చేస్తున్నాం' అని చైనాను ఉద్దేశించి విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విదేశాంగమంత్రి ప్రకటనపై కాంగ్రెస్‌ సహా విపక్షాలు తీవ్రంగా మండిపడ్డారు. దేశ చరిత్రంలో జైశంకర్‌ అత్యంత విఫల విదేశాంగమంత్రి అని కాంగ్రెస్‌ సోషల్‌మీడియా ఇన్‌చార్జి సుప్రియా శ్రీనేత్‌ విమర్శించారు. 'రెండున్నరేండ్లుగా భారత్‌లో అమెరికా రాయబారి లేడు. మీరేమో జీ20 అని డ్రామాలాడుతున్నారు. చైనా విషయంలో అబద్ధాలు చెప్పొద్దు. చైనా సైన్యం మన భూభాగాన్ని ఆక్రమించుకోలేదని సమావేశాల్లో మన ప్రధాని చెప్తారు. జైశంకర్‌ ఇలా చెప్తున్నారు. ఆయన స్టాక్‌హోం సిండ్రోమ్‌తో ఏమైనా బాధపడుతున్నారా?' అని ఎద్దేవా చేశారు. జైశంకర్‌ ప్రకటన తీవ్రమైన దైవ దూషణ వంటిదేనని మండిపడ్డారు. జైశంకర్‌ 'బేషరతుగా చైనాకు లొంగిపోయాం' అని చెప్పినా ఇంకా బాగుండేదని కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ ఎద్దేవా చేశారు. ఇండియా-చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంటులో చర్చకు భయపడి మోదీ సర్కారు ఎందుకు పారిపోతున్నదని ఎంఐఎం అధినేత అసదుద్దిన్‌ ఒవైసీ ప్రశ్నించారు. 'దెస్పాంగ్‌, దెమ్‌చోక్‌ ప్రాంతంలో చైనా సైన్యం 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించుకొన్న అంశంపై ఎన్డీయే ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదు. దేశంలోకి ఎవరూ చొరబడలేదు.. ఎవరూ చొరబడలేరు అంటూ ప్రధాని మోదీ దేశాన్ని తప్పుదోవ పట్టించారని మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఒప్పుకొంటారా?' అని నిలదీశారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీలోని ఎవరో ఒక నేత తరుచూ చైనాపై విమర్శలు గుప్పించటం పరిపాటిగా మారింది. ముఖ్యంగా దేశంలో బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ ప్రకటనలు మరింత ఎక్కువ అవుతున్నాయి. వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయి. చైనా సైన్యం సరిహద్దుల్లో చాలాచోట్ల భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిందని వార్తలు వచ్చాయి. రెండు నెలల క్రితం లడఖ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి నిర్వహించిన పరిశోధనలో కూడా ఇదే విషయం వెల్లడైంది. అయినా, కేంద్రం ఒక్క ఇంచు భూభాగం కూడా చైనాకు దక్కనివ్వలేదని భారీ ప్రకటనలు చేస్తూ వస్తున్నది. 2020, జూన్‌ 15-16 రాత్రి గల్వాన్‌లో భారత సైన్యంతో చైనా బలగాలు ఘర్షణకు దిగిన తర్వాత మోదీ సర్కారు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పలు దఫాలుగా చైనాకు చెందిన వందల మొబైల్‌ యాప్స్‌ను నిషేధించింది. యాప్‌ల నిషేధంతో చైనా ఆర్థికంగా దివాళా తీసినట్టే అన్నంతగా బీజేపీ శ్రేణులు బిల్డప్‌ ఇచ్చాయి. తీరా ఇప్పుడు విదేశాంగ మంత్రి సొంత ప్రభుత్వానికే గాలి తీసేశారని విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)