డన్జో సంస్థ డెలివరీ ఏజెంట్‌ లైంగిక వేధింపులు !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని డన్జో సంస్థకు చెందిన డెలివరీ ఏజెంట్‌ ఒక మహిళ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమె డన్జో సంస్థ నుంచి రూ.50 లక్షలు పరిహారం కోరింది. ఈ మేరకు వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. ఖాన్‌ అనే మహిళ ఇటీవల ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసింది. డన్జో సంస్థకు చెందిన డెలివరీ ఏజెంట్‌ మద్యం మత్తులో అర్థరాత్రి వేళ ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. దీనిపై ప్రశ్నించిన ఆమెను అసభ్యంగా తిట్టాడు. దీంతో ఆ మహిళ తొలుత డన్జో సంస్థకు ఫిర్యాదు చేసింది. ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో డన్జో డెలివరీ వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ విషయం తెలిసిన డెలివరీ వ్యక్తి ఆ మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె వాట్సాప్‌ నంబర్‌కు మెసేజ్‌లు పంపి కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించాడు. అలాగే కొంత మంది అమ్మాయిల ఫొటోలు కూడా పంపాడు. తన హెచ్చరికను పట్టించుకోని ఆ అమ్మాయిలను హత్య చేసినట్లు చెప్పాడు. కేసు వెనక్కి తీసుకోకపోతే వారి గతే ఆమెకు పడుతుందని హెచ్చరించాడు. దీంతో డెలివరీ వ్యక్తి వేధింపులు, బెదిరింపులపై ఆ మహిళ తీవ్రంగా స్పందించింది. డన్జో సంస్థకు లీగల్‌ నోటీసులు పంపింది. అయితే డెలివరీ ఏజెంట్‌ను సమర్థించిన ఆ సంస్థ ఆ మహిళనే తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. డెలివరీ వ్యక్తి లైంగిక వేధింపులు, నిర్లక్ష్యంగా అతడ్ని నియమించడం, తప్పుడు ప్రకటనలు, డెలివరీ సమయాన్ని తప్పుగా సూచించడం, వినియోగదారుల భద్రతను పట్టించుకోకపోవడంలో కంపెనీ వైఫల్యం వంటి పలు ఆరోపణలు చేసింది. వీటన్నింటికిగాను మొత్తం రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసింది. రాజ్ కుమార్ చౌహాన్, డాక్టర్ రాజేంద్ర ధర్‌లతో కూడిన ధర్మాసనం ఆ మహిళ ఫిర్యాదును పరిశీలించింది. దీనిపై జవాబు ఇవ్వాలంటూ డన్జో సంస్థకు నోటీసులు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)