ఏక్‌నాథ్‌ షిండేకే విల్లు-బాణం గుర్తు !

Telugu Lo Computer
0


మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానిదే అసలైన శివసేన అని భారత ఎన్నికల సంఘం గుర్తించింది. శివసేన ఆవిర్భవించినప్పటి నుంచి కొనసాగుతున్న ఆ పార్టీ ఎన్నికల గుర్తు 'విల్లు-బాణం', జెండా షిండే వర్గానికే చెందుతుందని స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని శివసేనలో తిరుగుబాటు జరిగిన ఎనిమిది నెలల హైడ్రామా అనంతరం ఏక్‌నాథ్ షిండే వేసిన దావాకు అనుకూలంగా ఎన్నికల సంఘం తీర్పు వెలువడడం గమనార్హం. ఈ మేరకే ఈసీఐ త్రిసభ్య కమిషన్‌ శుక్రవారం 78 పేజీల ఆదేశాల్లో తిరుగుబాటు తర్వాత ముఖ్యమంత్రి అయిన షిండేకు 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ గెలిచిన ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, పార్టీ సాధించిన ఓట్లలో ఇది 76 శాతమని కమిషన్ పేర్కొంది. ఉద్ధవ్‌ వైపు 23.5శాతం మందే ఉన్నట్లు వెల్లడించింది. గత ఏడాది జూన్‌లో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాఢీ(ఎంవీఏ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా షిండే తిరుగుబాటు బావుటా ఎగురేసి 40 పైచిలుకు ఎమ్మెల్యేలతో కలిసి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత.. ఉద్ధవ్‌, షిండే వర్గాల మధ్య అసలైన శివసేన ఎవరిదనే పోరు లేచింది. పార్టీ పేరు సహా పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే పేరును వాడుకోవడం, పార్టీ గుర్తు విషయంలో ఆధిపత్య పోరు మొదలైంది. ఆరు నెలల క్రితం తమ వర్గాన్నే అసలైన శివసేనగా గుర్తించాలని, పార్టీ గుర్తు 'విల్లు-బాణం' తమకే కేటాయించాలని కోరుతూ ఉద్ధవ్‌ ఠాక్రే ఈసీఐకి విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం త్రిసభ్య కమిషన్‌ ఏర్పాటైంది. ఉద్ధవ్‌, షిండే వర్గాల వాదోపవాదాలు, ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకుని, శుక్రవారం తుది ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. షిండే వర్గానిదే అసలైన శివసేన అని ఆ ఆదేశాల్లో ప్రకటించింది. ఆరు నెలల క్రితం కమిషన్‌ ఏర్పడగానే 1996లో ఏర్పడ్డ శివసేన పార్టీ పేరు, గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీజ్‌ చేసింది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఉద్ధవ్‌ వర్గానికి శివసేన(ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే) పార్టీ పేరును, ఎన్నికల గుర్తుగా వెలుగుతున్న కాగడను కేటాయించింది. ఇక షిండే వర్గానికి 'బాలాసాహెబ్‌ అంచి శివసేన' పేరును, ఎన్నికల గుర్తుగా రెండు కత్తులతో ఉన్న డాలును కేటాయించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)