కాంగ్రెస్‌లో చేరనున్న వరుణ్ గాంధీ ?

Telugu Lo Computer
0


సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కాషాయ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సంసిద్ధమవుతున్నారనే సంకేతాలు వెల్లడవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్ విధానాలను, పలు అంశాలపై పార్టీ అనుసరిస్తున్న వైఖరిని వరుణ్ గాంధీ ఎప్పటికప్పుడు ఎండగడుతూ బాహాటంగా అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పత్రికలు, ప్రసారమాధ్యమాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఆయన తన అభిప్రాయాలను తేటతెల్లం చేస్తున్నారు. గత నెలలో జరిగిన ఓ బహిరంగ సభలో వరుణ్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆయన బీజేపీకి గుడ్‌బై చెబుతారనే సంకేతాలు పంపాయి. తాను జవహర్‌లాల్ నెహ్రూకి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదని వరుణ్ గాంధీ స్పష్టం చేశారు. ప్రజల్లో అంతర్యుద్ధానికి ప్రేరేపించే బదులు మన రాజకీయాలు ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చేలా ఉండాలని బీజేపీకి ఆయన చురకలు వేశారు. కులం, మతం పేరుతో ఓట్ల వేటకు వస్తున్న ప్రస్తుత నేతలను నిరుద్యోగం, ఉపాధి, విద్య వంటి అంశాలపై వారు ఏం చేశారో అడగాలని కోరారు. ప్రజలను అణిచివేసే ధోరణులతో కూడిన రాజకీయాలను మనం విశ్వసించరాదని స్పష్టం చేశారు. 2019లో తన తల్లి మేనకా గాంధీకి నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో తిరిగి చోటు దక్కనప్పటి నుంచి వరుణ్ గాంధీ బీజేపీపై గుర్రుగా ఉన్నారు. యోగి ఆదిత్యానాధ్ తెరపైకి రాకముందు నుంచే యూపీ సీఎం అభ్యర్ధిగా తన పేరు వినిపించినప్పటికీ బీజేపీ అధిష్టానం తనను విస్మరించడం పట్ల కూడా వరుణ్ గాంధీ అసంతృప్తితో ఉన్నారు. పార్టీ హైకమాండ్ లక్ష్యంగా వరుణ్ గాంధీ విమర్శలకు పదును పెడుతుండటంతో ఆయన ఇక పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)