కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసల జల్లు !

Telugu Lo Computer
0


ఈ రోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. గత ఏడాది జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె లోక్‌సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే దేశం ఆత్మనిర్భర్ భారత్‌గా ఆవిర్భవిస్తోందని, పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని రాష్ట్రపతి తెలిపారు. తొమ్మిదేళ్ల ప్రభుత్వ పాలనలో పౌరుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. రాబోయే పాతికేళ్లు భారత్‌కు మరింత కీలకమన్నారు. ప్రపంచానికి భారత్ పరిష్కారాలు చూపేలా తయారైందన్నారు. అలాగే మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని, సైన్యంలో మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని, అన్ని రంగాల్లో మహిళలు రాణించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నిరుపేదలకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతోందని, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్రపతి ద్రౌపది చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రైతులకు ఫసల్ బీమా యోజన, కిసాన్ కార్డు వంటి పథకాలతో పాటు పంట నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నామని పునరుద్ఘాటించారు. కనీస మద్దతు ధర పెంచి రైతులను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. పేదరికం లేని భారత్ నిర్మాణంం కోసం కృషి జరుగుతోందని, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే భారత్ డిజిటల్ నెట్‌వర్క్ ప్రపంచానికే ఆదర్శంగా మారిందని కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పౌరుల ఆరోగ్యం, జల జీవన్ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు వంటి పథకాలతో ప్రభుత్వం మెరుగైన పాలన అందిస్తుందన్నారు. అవినీతి రహిత భారత్‌ కోసం కృషి చేస్తున్నామని ఈ క్రమంలోనే ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచామని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు ఓ విప్లవాత్మన నిర్ణయమని కొనియాడారు. సర్జికల్ స్ట్రైక్ ద్వారా సరిహద్దులు దాటిన ముష్కర మూకలను మట్టుబెట్టామని గుర్తుచేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)