రాత్రికి రాత్రే 50 వేల మందిని నిరాశ్రయులను చేయలేం !

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్‌లోని హల్ద్వాని ప్రాంత ప్రజలకు సుప్రీంకోర్టు గురువారం ఉపశమనం కలిగించింది. రాత్రికి రాత్రే 50 వేల మందిని నిరాశ్రయులను చేయలేమని పేర్కొంది. హల్ద్వాని రైల్వే భూమిలో సుమారు నాలుగు వేల నివాసాల తొలగింపుకు లైన్‌ క్లియర్‌ చేస్తూ ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఇది మానవ సంబంధమైన సమస్య అని, ఆచరణీయ పరిష్కారం చూడాల్సి వుందని చీఫ్‌ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ప్రజలను అక్కడి నుండి ఖాళీ చేయించేందుకు బలగాలను వినియోగించాలని ఉత్తరాఖండ్‌ కోర్టు సూచించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించడానికి పారామిలటరీ బలగాలను వినియోగించడం సరికాదని పేర్కొంది. హల్ద్వాని ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు నియమించకూడదని ఆదేశించింది. అలాగే రైల్వే శాఖ, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ స్పందనను తెలపాల్సిందిగా సూచించింది. కేసు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. నివాసాల తొలగింపులను ఆపాలని క్యాండిల్‌ మార్చ్‌లు, ఆందోళనలు, ప్రార్థనలు చేపడుతున్న నివాసితులకు ఈ ఆదేశం పెద్ద ఉపశమనం కలిగించింది. రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతం బంభుల్‌పురాలోని హల్ద్వాని రైల్వే స్టేషన్‌, గఫూర్‌ బస్తీ, ధోలక్‌ బస్తీ, ఇందిరా నగర్‌ల మధ్య విస్తరించింది. ఇళ్లతో పాటు సగం కుటుంబాలు భూమిని లీజుకు తీసుకున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నాలుగు పాఠశాలలు, 11 ప్రైవేట్‌ పాఠశాలలు, ఒక బ్యాంకు, రెండు ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంకులు, నాలుగు దేవాలయాలు, పది మసీదులు ఉన్నాయి. 2013లో ఈ ప్రాంతానికి సమీపంలోని నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలపై పిటిషన్‌ దాఖలు కావడంతో ఈ అంశం కోర్టుకు చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)