ఫిబ్రవరి 17న కొత్త సచివాలయ ప్రారంభం !

Telugu Lo Computer
0


తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న కొత్త సచివాలయాన్ని ప్రారంభించబోతున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ చేతుల మీదుగా సచివాలయ ప్రారంభోత్సవం జరుగుతుందని ఆయన చెప్పారు. నూతన సచివాలయం నిర్మాణానికి 2019 జూన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. రూ.617 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు. ఈ సెక్రటేరియట్ భవనానికి 'డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం'గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, సీఎస్‌ కార్యాలయాలు ఇప్పటికే 90 శాతం పూర్తయినట్లు సమాచారం. ఆధునిక హంగులతో వాస్తు సహా అన్ని రకాలుగా పరిశీలించి 20 ఎకరాల స్థలంలో కొత్త సచివాలయ నిర్మాణ పనులు చేపట్టారు. ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి. ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు క్యాబినెట్ మీటింగ్ హాల్, మరో పెద్ద మీటింగ్ హాల్ తదితరాలు ఉంటాయి. రెండో అంతస్తు నుంచి మంత్రుల కార్యాలాయాలు ఉంటాయి. సర్వర్లు, స్టోర్ రూంలు, తదితర అవసరాలన్నింటినీ కింది అంతస్థులోనే ఏర్పాటు చేయనున్నారు. విశాలమైన పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులకు విడిగా పార్కింగ్ ఉంటుంది. అధికారులు, సిబ్బందికి కూడా వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం ఉంటుంది. సందర్శకుల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ వసతి ఉంటుంది. ప్రార్థనా మందిరాలు, మిగతా కార్యాలయాలు అన్నీ సచివాలయం వెలుపలే ఉంటాయి. ప్రహరీ లోపల కేవలం సచివాలయ భవనం మాత్రమే ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)