నేను కాపీ కొట్టి పదో తరగతి పాసయ్యా !

Telugu Lo Computer
0


దువుకునే రోజుల్లో తనకు కాపీ కొట్టడంలో మంచి ప్రావీణ్యం ఉందని, తాను కాపీ కొట్టే పదో తరగతి పాసయ్యానని కర్ణాటక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బీ శ్రీరాములు  అన్నారు. బళ్లారి జిల్లాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ.. ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ''చదువుకునే రోజుల్లో నేను ట్యూషన్‌లో ప్రతిరోజూ అవమానానికి గురయ్యేవాడ్ని. టీచర్లు నన్ను అందరి ముందు తిట్టేవారు. నన్ను ఒక వెర్రివాడిలాగా చూసేవారు. కానీ.. ఎప్పుడైతే నేను పదో తరగతి పాసయ్యానో, అప్పుడు నా టీచర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పుడు నేను కాపీ కొట్టి పదో తరగతి పాసయ్యానని టీచర్‌కి చెప్పాను. అంతేకాదు.. చీటింగ్ చేయడంలో నేను ఛాంపియన్‌ని అని, అందులో తాను పీహెచ్‌డీ చేశానని టీచర్‌కి చెప్పా'' అంటూ మంత్రి పేర్కొన్నారు. స్కూల్‌లో తాను ఉత్తీర్ణుడ్ని కానని, ఎందరో టీచర్లు తనని ఎడ్యుకేట్ చేసేందుకు ప్రయత్నించారని శ్రీరాములు అన్నారు. కానీ.. ఎందుకో తాను సరిగ్గా చదువుకోలేకపోయానని చెప్పారు. నాకు చదువు రాదని ఎందరో తనని హేళన చేశారని పేర్కొన్నారు. కాలేజీ రోజుల్లో తాను కన్నడ సహా ఏ భాషలోనూ సరిగ్గా మాట్లాలేనంటూ టీచర్లు చెప్పారని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు.. తాను 14 సార్లు జైలుకు కూడా వెళ్లానని బాంబ్ పేల్చారు. తాను పేదవాళ్లను కాపాడేందుకు, వారికి న్యాయం చేసేందుకు రౌడీగా కూడా వ్యవహరించానన్నారు. టీచర్లనే ర్యాగింగ్ చేశానన్నారు. తాను ఎప్పుడైతే జీన్స్ వేస్తానో, అప్పుడు కాలేజీలోని అమ్మాయిలందరూ తనవైపే చూసేవారని వెల్లడించారు. ఇలా ఈ విధంగా ఒక మంత్రి వ్యాఖ్యలు చేయడంతో.. అది వివాదాస్పదం అయ్యింది. మంత్రి హోదాలో ఉంటూ, ఇలాంటి వ్యాఖ్యలా చేసేది? విద్యార్థులకు ఏం నేర్పిస్తున్నారు? అంటూ శ్రీరాములుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)