బెలగావిలో 5వేల మంది పోలీసులతో బందోబస్తు

Telugu Lo Computer
0


మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దులో మరో సారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బెలగావిలోని విధాన సౌధలో సోమవారం నుండి కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో నిరసన తెలిపేందుకు అక్కడికి చేరుకున్న ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. బెలగావి నగరంలోనే సుమారు 5వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ విధించారు. బెలగావిని మహారాష్ట్రలో విలీనం చేయాలంటూ మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి (ఎంఇస్‌) ఐదు దశాబ్దాలుగా డిమాండ్‌ చేస్తోంది. సోమవారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నిరసనచేపట్టాలని పిలుపునిచ్చింది. దీంతో మహారాష్ట్ర నుండి వచ్చిన కాంగ్రెస్‌, ఎన్‌సిపి , శివసేన నేతలు తమ మద్దతుదారులతో కలిసి బెలగావిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఎన్‌సిపి నేత హసన్‌ ముష్రిఫ్‌, శివసేన కొల్హాపుర్‌ జిల్లా అధ్యక్షుడు విజయ్ దెవానేలతో పాటు వందలాది మందిని పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 300కి పైగా శివసేన, కాంగ్రెస్‌, ఎన్‌సిపి మద్దతుదారులను సరిహద్దులో నిలిపివేశారు. కొందరిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సరిహద్దు వివాదంపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి చీఫ్‌గా ఉన్న మహారాష్ట్ర ఎంపీ ధైర్యశీల్‌ సాంభాజిరావ్‌ మానే కూడా బెలగావిలో పర్యటిస్తానని జిల్లా అధికారులు, పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయనను నగరంలోకి రాకుండా కర్ణాటక పోలీసులు నిషేధం విధించారు. ప్రధాని మోడీ భారత్‌ను విభజించాలని చూస్తున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పాటోల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కారణంగానే ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ప్రారంభమైందని, ప్రధాని మహారాష్ట్రను విభజించాలనిచూస్తున్నారని మండిపడ్డారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్‌షా సమావేశం జరిగిన సమయంలో .. నేతలను ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. దీంతో ఈ వివాదం వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని నిర్ణారణైందని అన్నారు. మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వివాదాన్ని విస్మరించడం సమంజసం కాదని శివసేన నేత సంజరు రౌత్‌ అన్నారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహిస్తోన్న మోడీ.. మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వివాదాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)