15 ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు దగ్ధం !

Telugu Lo Computer
0


గుజరాత్ లోని నర్మదా జిల్లాలో 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' వద్ద పర్యాటకులను అద్దెకు తిప్పే 15 ఎలెక్ట్రిక్ ఆటోరిక్షాలు గురువారం ఉదయం దగ్ధం అయ్యాయని అధికారులు తెలిపారు. బ్యాటరీ ఛార్జింగ్ చేసేప్పుడు ఆటోరిక్షాలు అంటుకున్నాయన్న రిపోర్టులను 'ది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏరియా డెవలప్‌మెంట్ అండ్ టూరిజం గవర్నెన్స్ అథారిటీ(ఎస్‌ఓయూఎడిటిజిఎ)' ఖండించింది. పర్యాటకులను తిప్పే 90కి పైగా ఆటో రిక్షాలను ఓ ప్రయివేట్ సంస్థ నిర్వహిస్తోంది. స్థానిక గిరిజన మహిళలే వాటికి డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. అధికారుల కథనం ప్రకారం " గురువారం తెల్లవారుజామున చార్జింగ్ కోసం కేవడియా గ్రామంలోని ఛార్జింగ్ స్టేషన్ వద్ద 15 ఆటోలు నిలిపి ఉంచగా అవి దగ్ధం అయ్యాయి. కారణాలు తెలియలేదు. అయితే ఆటోలు ఛార్జింగ్ స్టేషన్‌కు 35 అడుగుల దూరంలో ఉండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దానివల్ల చార్జింగ్ చేస్తుండగా ఆటో రిక్షాలు అంటుకోలేదని స్పష్టం అయింది" ఎస్‌ఓయూఎడిటిజిఎ తన ప్రకటనలో పేర్కొంది. అగ్ని మాపక శకటాలు వెంటనే ఘటనా స్థలికి వెళ్లి వేరే ఆటోలు దగ్ధం కాకుండా నివారించాయి. దగ్ధం అయిన ఎలక్ట్రిక్ ఆటో అగ్నికీలలను ఆర్పేశాయి. కాగా ఆ ప్రయివేట్ సంస్థ ఎలక్ట్రిక్ ఆటోలు దగ్ధం కావడానికి గల కారణాలు కనుగొనమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రపంచంలోనే ఎత్తైన 182 మీటర్ల వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం వడోదర నగరానికి 100 కిమీ. దూరంలో ఉన్న కేవడియా గ్రామంలో నిర్మించారు. అక్కడే ఈ ఎలక్ట్రిక్ ఆటోలు బాడుగకు తిరుగుతుంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)