రికార్డు స్థాయిలో యాదాద్రి ఆదాయం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్తీక మాసం చివరి వారం కావడంతో ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. నిన్న ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. వివిధ సేవల ద్వారా రూ.1,16,13,977 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. గత ఆదివారం నాటి రికార్డును ఈరోజు ఆదాయం బ్రేక్ చేసింది. కార్తీక ఏకాదశి, పైగా సెలవురోజు కావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. శివాలయం, కార్తీక దీపారాధన, వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. కల్యాణ కట్ట, పార్కింగ్ ఏరియా, బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు రద్దీగా మారాయి. దీంతో స్వామివారి దర్శనానికి 4 గంటలు.. ప్రత్యేక దర్శనానికి రెండు గంటలకుపైగా సమయం పట్టింది. భక్తులు భౌతిక దూరాన్ని పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక దర్శనం అనంతరం సాయంత్రం భక్తులు ఒక్కసారిగా తిరుగుప్రయాణం కావడంతో జాతీయ రహదారి 163పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరంగల్-హైదరాబాద్ మార్గంలో అర కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)