శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత

Telugu Lo Computer
0


హైద్రాబాదు లోని శంషాబాద్ విమానాశ్రయంలో విదేశాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అమీర్ ఖాన్, మహ్మద్ ఖురేషీ అనే ప్రయాణికుల వద్ద రూ. 3 కోట్ల విలువ చేసే ఐదున్నర కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. అధికారులకు అనుమానం రాకుండా ఉండేందుకు.. ఆ కేటుగాళ్లు చాలా తెలివిగా బంగారాన్ని పేస్టుగా మార్చి, తమ లో-దుస్తుల్లో దాచుకున్నారు. తమ ప్లాన్ వర్కౌట్ అవుతుందని భావించారు. కానీ, వీరి ప్లాన్ బెడిసికొట్టింది. వారి ప్రొఫైల్స్‌పై అధికారులకి అనుమానం రావడంతో, అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే వారి గుట్టు రట్టయ్యింది. బంగారం సీజ్ చేసిన అనంతరం.. ఆ ఇద్దరిపై అక్రమ బంగారం రవాణా కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇలాంటి సంఘటనలు ఈమధ్య తరచూ చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 13వ తేదీన కూడా బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు మహిళల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇద్దరు మహిళల నుంచి.. రూ.74 లక్షల విలువ చేసే 1410 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. అదే నెలలో 6వ తేదీన ఓ ప్రయాణికుడు కూడా అడ్డంగా బుక్కయ్యాడు. అతని కదిలికలపై అనుమానం రావడంతో, అదుపులోకి తీసుకొని విచారించగా.. దాదాపు 5 కిలోల బంగారం లభ్యమైంది. అంతకుముందు జులైలోనూ.. రూ. 50 లక్షలకు పైగా విలువ చేసే 1196 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఒక వ్యక్తి బంగారం గొలుసుకు పూసలు వేసుకోగా.. మరో వ్యక్తి బంగారం కడ్డీలను లోదుస్తుల్లో దాచుకుని తరలిస్తుండగా, అధికారులు పట్టుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)