కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ సంస్థల ధారాదత్తం !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని  హిమాయత్ నగర్ సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ  ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్రం యువతను మోసం చేసిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశ ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడిందన్నారు. కార్పొరేట్ శక్తులకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటూ ప్రభుత్వ సంస్థలను వారికి ధారాదత్తం చేస్తోందని డి. రాజా విమర్శించారు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారాయన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని సెక్యులర్ రాజకీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాంతీయ, బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. బీజేపీని ఓడించేందుకే అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై ముందుకు వెళ్తామని డి.రాజా వెల్లడించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ప్రైవేటు విమానయాన సంస్థలు హవాలా మనీ, బంగారాన్ని విమానాలలో తరలిస్తున్నాయనే విషయం ఈడీ విచారణను బట్టి తెలుస్తోందన్నారు. ఈ విధంగా అక్రమంగా ఎయిర్ పోర్ట్ ల మీదుగా హవాలా డబ్బు రవాణా అవుతుంటే ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. సామాన్య ప్రయాణికులను ఏ విధంగా అయితే తనిఖీలు చేస్తున్నారో.. ప్రైవేటు జెట్ సంస్థల ప్రతినిధులను, వారి వస్తువులను కూడా తనిఖీ చేయాలన్నారు. విమానాల ద్వారా నల్లదనాన్ని, హవాలా డబ్బు ఎలా తరలిస్తారో ఇప్పుడు తెలిసిందన్నారు.ఎవరికైనా ప్రత్యేక విమానాలు ఉంటే వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎయిర్ వేస్ కి ఉందన్నారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునమనేని సాంబశివరావు మాట్లాడుతూ..బీజేపీని ఓడించడమే మా లక్ష్యమని అన్నారు. ఎన్నికల సమయంలో.. మేము స్ట్రాంగ్ గా ఉన్న ప్లేస్ లో టికెట్ అడుగుతామన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)