సబ్సిడీ కోసం ఫొటో దిగాలి మొఖం కడుక్కొని రమ్మన్నారు....!

Telugu Lo Computer
0


బీహార్ లోని చాంద్ పురాలో ప్రాంతంలోని నాన్కర్ అనే గ్రామంలో దేవంతి దేవి అనే మహిళ కుటుంబంతో సహా నివసిస్తోంది. ఈ మధ్యకాలంలోనే ఆమెకు ప్రభుత్వ పథకం కింద మరుగుదొడ్డి మంజూరైంది. దీంతో ఆమె మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి చేసింది. ఇందుకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు ఘరానా మోసగాళ్లు ప్రభుత్వ అధికారులం అంటూ చెప్పి ఆమె ఇంటికి వచ్చారు. మరుగుదొడ్డి వెరిఫికేషన్ కోసం అని చెప్పి నమ్మించారు. మరుగుదొడ్డి ఎదురుగా నిలబడితే ఫొటో తీస్తామని, అలా అయితేనే సబ్సిడీ డబ్బులు వస్తాయని చెప్పారు. ఫొటోలో నగలు, ఖరీదైన దుస్తులు ఉంటే సబ్సిడీ వర్తించదని మాయమాటలు చెప్పి బురిడీ కొట్టించారు. నగలు తీసి పక్కకు పెట్టేసి.. ముఖం కడుక్కొని రావాలని చెప్పారు. ఆ మాటలు నమ్మిన బాధితురాలు దేవంతి దేవి.. నగలు తీసి టేబుల్ మీద పెట్టి మొహం కడుక్కోవడానికి వెళ్లింది. మొహం కడుక్కొని తిరిగి వచ్చేసరికి ఆ ఇద్దరు వ్యక్తులు కనిపించలేదు. పక్కింటికి సర్వే కోసం వెళ్లారనుకొని అటూ ఇటూ చూసింది. ఎక్కడా కనిపించలేదు. వారు వచ్చిన బండి కూడా కనిపించలేదు. తీరా ఇంట్లోకి వచ్చి చూస్తే టేబుల్ మీద పెట్టిన నగలు కనిపించలేదు. వారు దొంగలు అనే విషయం అప్పుడు అర్థమై లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మాయమాటలు చెప్పి మోసం చేసే కొత్త వ్యక్తులను అస్సలు నమ్మొద్దని.. అపరిచితులతో మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)