విచారణాధికారికి బెదిరింపు

Telugu Lo Computer
0


కేరళలో హత్యకు గురైన ఆర్ఎస్ఎస్ నేత శ్రీనివాసన్ హత్య కేసును విచారిస్తున్న అధికారి ఎం.అనిల్ కుమార్‌ను చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. కేసు విచారణ నుంచి తప్పుకోవాలని ఆయనను బెదిరించారు. లేకుంటే శవ పేటిక సిద్ధం చేసుకోవాలని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం తనకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు అనిల్ కుమార్ చెప్పారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేరళ, పాలక్కడ్ జిల్లాలో గత ఏప్రిల్‌లో ఆర్ఎస్ఎస్ నేత శ్రీనివాసన్ హత్యకు గురయ్యాడు. అంతకుముందు రోజు పీఎఫ్ఐకి చెందిన ఒక నేత హత్య జరిగింది. ఈ హత్యకు నిరసనగా, కొందరు దుండగులు ఆర్ఎస్ఎస్‌కు చెందిన శ్రీనివాసన్‌ను హత్య చేశారు. బైకుపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడ్డారు. దీంతో ఈ అంశం అప్పట్లో సంచలనంగా మారింది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అప్పట్లోనే కొందరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఇప్పటివరకు ఈ కేసుతో సంబంధం ఉన్న 34 మంది పీఎఫ్ఐ సభ్యుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విచారణ అధికారిగా ఉన్న అనిల్ కుమార్‌కు తాజాగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. పీఎఫ్ఐని ఇటీవల కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)