కాంగ్రెస్ దేశ భద్రతకే కాదు - దేశాభివృద్ధికి కూడా వ్యతిరేకం !

Telugu Lo Computer
0


హిమాచల్‌లోని మండిలో జరిగిన మొదటి ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం దేశ భద్రతకు విరుద్ధమే కాదు, దేశాభివృద్ధికి కూడా వ్యతిరేకమని విమర్శలు గుప్పించారు. కేంద్రంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన రక్షణ ఒప్పందాల అంశాన్ని లేవనెత్తారు. ఆయుధాల సేకరణలో జాప్యానికి దారితీసిన ప్రతి డీల్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ “కమీషన్ కావాలి” అంటూ ఆరోపించారు. స్వాతంత్య్రానంతరం రక్షణ రంగంలోనే దేశంలోనే తొలి స్కామ్‌ చేసింది కాంగ్రెస్‌.. అప్పటి నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు రక్షణ ఒప్పందాల విషయంలో చాలా కుంభకోణాలకు పాల్పడిందని ప్రధాని మోడీ ఆరోపించారు. దేశం అభివృద్ధి చెందాలని కాంగ్రెస్‌ ఎన్నడూ కోరుకోలేదని ఆయన అన్నారు. ప్రతి రక్షణ ఒప్పందంలో కమీషన్ కావాలని, పార్చీ సొంత నాయకుల నిధిని నింపాలని ఆ పార్టీ కోరుకుందని.. అందుకే ఆయుధాల సేకరణ ఆలస్యమైంది ప్రధాని మోడీ చెప్పారు. ప్రస్తుతం భారతదేశం ఆత్మనిర్భర్‌గా మారుతుందనే ప్రచారం జరుగుతోందని అన్నారు. రాజీ పడిన రక్షణ ఒప్పందాల కారణంగా కాంగ్రెస్ అనేక మంది జీవితాలను ప్రమాదంలో పడేసిందని ఆయన మండిపడ్డారు. హిమాచల్ తల్లులు, కుమార్తెలకు ఈ అన్యాయాన్ని తాను జరగనివ్వనన్నారు. అందుకే భారతదేశం ఆత్మనిర్భర్‌గా మారాలని, తన సొంత ఆయుధాలను తయారు చేసుకోవాలని బీజేపీ సర్కారు ఒత్తిడి చేస్తోందన్నారు. కాంగ్రెస్ కేవలం దేశ భద్రతకు విరుద్ధం కాదు, దేశాభివృద్ధికి కూడా విరుద్ధమన్నారు. తప్పుడు వాగ్దానాలు చేయడం, తప్పుడు హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పాత ట్రిక్ అని, హిమాచల్ అభివృద్ధికి పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. హిమాచల్‌ అభివృద్ధికి కాంగ్రెస్‌ ఎన్నడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. 2012 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కాంగ్రెస్‌ నెరవేర్చలేదు. బీజేపీ ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చింది. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలని బీజేపీ సంకల్పించిందని, దానిని నెరవేర్చామని ప్రధాని చెప్పారు. రామమందిరాన్ని నిర్మించాలని బీజేపీ తీర్మానం చేసింది. వెంటనే మందిరాన్ని నిర్మించడానికి బీజేపీ సంకల్పించిందన్నారు. నవంబర్ 12న రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్న ప్రధాని, ఈ ఎన్నికల్లో వేసే ఓటు రాబోయే 25 సంవత్సరాల రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని నిర్ణయిస్తుందని ప్రధాని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)