మీరు ఎలా గెలుస్తారో చూస్తా !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ఇప్పటం బాధితులకు రూ.లక్ష చొప్పున పరిహారం చెక్కులను అందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైసిపి పార్టీపై నిప్పులు చెరిగారు. పేదల గడపలు కూల్చిన వైసీపీ గడపను కూల్చేవరకు వదిలిపెట్టమని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటం గడపలను కూల్చి నా గుండెలో గునపం దింపారు. 2024 ఎన్నికల తరువాత వైసిపి నాయకులు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో తాను చూస్తానని అన్నారు. నెక్స్ట్ టార్గెట్ 175 అంటున్నారు. మేము నోట్లో వేలు పెట్టుకొని చూస్తూ ఉంటామా !. మీరు ఎలా గెలుస్తారో చూస్తా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒకవేళ స్వాతంత్ర్య ఉద్యమంలో వైసిపి నాయకులూ పాల్గొని ఉంటే వైఎస్సార్ ఇండియాగా పేరు మార్చేసేవారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ప్రతీ పథకానికి ఆయన పేరే పెట్టేవారన్నారు. ఇప్పటంలో జాతీయ నాయకుల విగ్రహాలు కూల్చేసి, వైఎస్సార్ విగ్రహాన్ని మాత్రం అలాగే ఉంచారని పవన్ మండిపడ్డారు. జాతీయ నాయకులకంటే వైఎస్సార్ గొప్పవాడు కాదన్నారు. ఇక ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో ప్రజలు తమకే మద్దతు తెలిపారన్న వైసిపి నేతల వ్యాఖలపై పవన్ స్పందించారు. ప్రజల మనస్సులో ఎన్టీఆర్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, కానీ కళ్లు లేనివారిని వాలంటీర్లతో బెదిరించిన చరిత్ర వైసిపి నేతలదే అని పవన్ అన్నారు. భవిష్యత్తు తరాల కోసం ఎవరో ఒకరు పోరాటం చేయాలనీ పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ ప్రజల కోసం తాను పోరాటం చేస్తున్నానన్నారు. ఈ పోరాటంలో తనకు ఎన్నో బెదిరింపులు వచ్చాయని అది వైసిపి నేతల పనే అని పవన్ తెలిపారు. ఈ విషయం సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా తెలుసన్నారు. ఆశయం కోసం పని చేసే వారికి చావు వెన్నంటే ఉంటుందన్నారు. కానీ ఆ ఆశయం కోసం చనిపోయిన బాధ ఉండదు. ఏ పని చేయకుండా చనిపోతే మాత్రం చాలా బాధగా ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులే రాజకీయాల్లోకి రావాలా అని పవన్ ప్రశ్నించారు. సామాన్యులు కూడా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఈ మట్టిలోనే పుట్టానని, ఆంధ్రుడినని నేను యుద్ధం తప్పకుండ చేస్తానని అన్నారు. అయితే వైసీపీని ఓడించడానికి బీజేపీతో కలవాల్సిన అవసరం లేదని పవన్ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)