బీజేపీది సంకల్ప్‌ పత్ర్ కాదు - జుమ్లా పత్ర్‌ !

Telugu Lo Computer
0


హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ ఫేక్‌ వాగ్ధానాలు చేస్తున్నదని కాంగ్రెస్‌ ఇంఛార్జీ రాజీవ్‌ శుక్లా ఆరోపించారు. సంకల్ప్‌ పత్ర్‌ పేరుతో బీజేపీ తమ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ సంకల్ప్‌ పత్ర్‌ అని చెప్పుకుంటున్నది, కానీ ఇది నిజానికి జుమ్లా పత్ర్‌ అంటూ దుయ్యబట్టారు. ఈ మ్యానిఫెస్టోలో పెట్టిన అనేక హామీలు 2017 మ్యానిఫెస్టో నుంచి కాపీ పేస్ట్‌ చేశారని చమత్కరించారు. గతంలో చేసిన హామీలకే దిక్కులేదు, కానీ కొత్తగా అమలుకు వీలు కానీ వాగ్ధానాలు చేస్తున్న బీజేపీ.. మరోసారి హిమాచల్‌ పీఠం ఎక్కడమే పరమావధిగా ప్రజల్ని వంచిస్తున్నదని విమర్శించారు. పాత పెన్షన్‌ స్కీమ్‌గానీ, ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తావన గానీ బీజేపీ మ్యానిఫెస్టోలో లేదని రాజీవ్‌ శుక్లా చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని మా మ్యానిఫెస్టోలో పెట్టాం, దీన్ని కాపీ కొట్టిన బీజేపీ 8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని యువతను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) ని అమలు చేస్తామని బీజేపీ ప్రకటించిందని, తాము కూడా యూసీసీని స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే, ముందుగా ఉత్తరాఖండ్‌లో అమలుచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 2017 లో బీజేపీ ఇచ్చని హామీలేవీ అమలుకాలేదని, ఇప్పుడు మరోసారి ఓటర్లను మోసం చేసేందుకు ముందుకు వస్తున్నదని ఏఐసీసీ అధికార ప్రతినిధి ఆల్కా లాంబా విమర్శించారు. తమ మ్యానిఫెస్టోను కాపీ కొట్టిన బీజేపీకి హిమాచల్‌ ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు ఎదురుచూస్తున్నారని చెప్పారు. ప్రతీ గ్రామానికి రోడ్డు, యువతకు స్టార్టప్‌ ఫండ్‌, ప్రధాన పుణ్యక్షేత్రాల అభివృద్ధి, హెలి అంబులెన్సులు.. ఇలా ఎన్నో హామీలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)