పోలీస్‌ స్టేషన్‌పై దాడి ఘటనలో 3000 మందిపై కేసులు !

Telugu Lo Computer
0


కేరళలో అదానీ ఓడరేవు నిర్మాణానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆందోళన కారులు గత రాత్రి విళింజం పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా 3000 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టవిరుద్ధమైన సమావేశాల నిర్వహణ, అల్లర్లు, నేరపూరిత కుట్ర అభియోగాల కింద కేసులు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో పురుషులు, మహిళలతో పాటు చిన్నారులు కూడా ఉండటం గమనార్హం. గత రాత్రి పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడిలో దాదాపు 40 మంది పోలీసులతోపాటు పలువురు స్థానికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఓ కేసులో అరెస్టయిన వ్యక్తిని విడుదల చేయాలంటూ దాదాపు 3000 మంది పోలీస్‌స్టేషన్‌పై మూకుమ్మడిగా దాడికి యత్నించారని పోలీసులు చెబుతున్నారు.'' ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇనుపరాడ్లు, రాళ్లు, కర్రలతో వారంతా స్టేషన్‌ వద్దకు చేరుకొని భయానక వాతావరణం సృష్టించారు. అరెస్టు చేసిన వ్యక్తిని విడుదల చేయకపోతే పోలీస్‌ స్టేషన్‌ను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. అయినా, నిందితుడిని విడుదల చేయకపోడంతో హింసాత్మక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదు పోలీసు వాహనాలతోపాటు స్టేషన్‌లోని విలువైన సామగ్రి నాశనమైంది''అని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. దాదాపు రూ.85 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఈ దాడిని తిరువనంతపురం సిటీ పోలీస్‌ కమిషనర్‌ తీవ్రంగా ఖండించారు. ఆందోళనకారులు ఈ విధంగా దాడులకు పాల్పడటం సమంజసం కాదన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో తిరువనంతపురం వ్యాప్తంగా ప్రత్యేక బలగాలను మోహరించినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దాదాపు 900 మిలియన్ల డాలర్ల పెట్టుబడితో అదానీ సంస్థ తిరువనంతపురం సమీపంలోని విళింజంలో పోర్టు నిర్మాణం చేపడుతోంది. దీనివల్ల తమ జీవనోపాధికి విఘాతం కలుగుతుందని స్థానిక మత్యకారులు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు పనులకు ఆటంకం కలిగింది. అయితే, ఇటీవల అదానీ గ్రూప్‌నకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో పనులు పునఃప్రారంభించేందుకు ఆ సంస్థ ప్రయత్నించింది. భారీ యంత్రాలను నిర్మాణ ప్రదేశంలోకి తరలిస్తుండగా ప్రధాన గేటు వద్ద స్థానికులు శనివారం అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఆందోళనకారులు పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)