జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఊరట !

Telugu Lo Computer
0


రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు మరింత ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను దిల్లీ కోర్టు నవంబరు 10వ తేదీ వరకు పొడిగించింది. ఈ కేసులో జాక్వెలిన్‌ రెగ్యులర్‌ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా, దానిపై దిల్లీ కోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ విచారణ నిమిత్తం నటి శనివారం కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నుంచి తమకు ఎలాంటి పత్రాలు అందలేదని నటి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌, ఇతర పత్రాలను అన్ని పక్షాల వారికి అందజేయాలని న్యాయస్థానం ఈడీకి సూచించింది. అనంతరం రెగ్యులర్‌ బెయిల్‌పై తదుపరి విచారణను నవంబరు 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. అప్పటిదాకా నటికి మధ్యంతర బెయిల్‌ కొనసాగుతుందని స్పష్టం చేసింది. దాదాపు రూ.200కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్  నుంచి జాక్వెలిన్‌ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఇటీవల దిల్లీ పోలీసులు కూడా ఈ కేసులో నటిని రెండు సార్లు విచారించారు. సుకేశ్‌ చంద్రశేఖర్‌ నుంచి ఆమె అందుకున్న ఖరీదైన బహుమతులు, ఇతర ఆర్థిక లావాదేవీల గురించి ఆమెను ఆరా తీశారు. ఈ క్రమంలోనే బెయిల్‌ కోసం నటి దిల్లీ కోర్టును ఆశ్రయించగా.. సెప్టెంబరు 26న న్యాయస్థానం ఆమెకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)