పశువుల మందను ఢీకొన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని వట్వ-మణినగర్ స్టేషన్ల మధ్య ఈ ఉదయం 11:20 నిమిషాల సమయంలో ఈ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది.  పట్టాలపైకి వచ్చిన పశువుల మందను ఢీకొట్టిందీ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్. దీనితో ముందు రైలు ముందుభాగం దెబ్బతిన్నది. కుడి భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. ముందు భాగం మొత్తం ఊడి చేతికొచ్చింది. వేగంగా ఢీ కొట్టడంతో పెద్దగా కుదుపులకు లోనై, భారీగా శబ్దం చేస్తూ నిలిచిపోయింది. ఈ ఘటనతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు స్వల్పంగా అంతరాయం ఏర్పడింది. అర గంటకు పైగా రైళ్ల రాకపోకలను మణినగర్, వట్వ స్టేషన్లలో నిలిపివేశారు. పశ్చిమ రైల్వే అధికారులు ట్రాక్‌ను క్లియర్ చేసిన తరువాత యధాతథంగా రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే ఆట్టహాసంగా జెండా ఊపి ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్ వందే భారత్. ఇంకో రెండు నెలల్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మొన్నీమధ్యే ఆయన అక్కడ పర్యటించారు. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.  పర్యటన సందర్భంగా ఆయన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. గాంధీనగర్ నుంచి ముంబై సెంట్రల్ వరకు రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ ఇది. వందే భారత్ ప్రాజెక్ట్‌లో ఇది మూడో రైలు. ఇదివరకు న్యూఢిల్లీ-వారణాశి, న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా స్టేషన్ల మధ్య ఈ రైలు పట్టాలెక్కింది. మూడో ఎక్స్‌ప్రెస్ గాంధీనగర్-ముంబై సెంట్రల్ మధ్య అందుబాటులోకి వచ్చింది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులపాటు ఈ రైలు అందుబాటులో ఉంటుంది.  16 బోగీలు ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్ సీట్ల సామర్థ్యం 1,128. గాంధీనగర్ దాటుకుంటే అహ్మదాబాద్, వడోదర, సూరత్ మధ్య మాత్రమే ఈ రైలు హాల్ట్ సౌకర్యం ఉంది. ప్రతిరోజూ తెల్లవారు జామున 6:10 నిమిషాలకు ముంబై సెంట్రల్ నుంచి బయలుదేరే ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 12:30 గంటలకు గాంధీనగర్‌కు చేరుకుంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2:05 నిమిషాలకు గాంధీనగర్ నుంచి బయలుదేరి రాత్రి 8:35 నిమిషాలకు ముంబై సెంట్రల్‌కు చేరుకుంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)