రైతుల యాత్ర కాదు - బినామీ యాత్ర

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ అమరావతి రైతుల పాదయాత్రని అది రైతుల యాత్ర కాదని బినామీ యాత్ర అని వర్ణించారు. పాదయాత్ర చేసేది రైతులు కాదని తాము తొలిరోజు నుంచి చెప్తున్నామని.. ముసుగువీరులు ఎవరో శాసనసభలోనే చెప్పామని తమ్మినేని సీతారాం గుర్తుచేశారు. 28వేల మంది వద్ద బలవంతంగా భూములు లాక్కొంటే పాదయాత్రకు ఎంత మంది వచ్చారో అందరూ చూశారన్నారు. ఐడెంటెటీ కార్డులు కేవలం 70 మందే పట్టుకుని వచ్చారంటే ఏమనాలని ప్రశ్నించారు. ఇది డ్రామా కాదా.. ఎవడి డ్రామా అని నిలదీశారు. ఐడీ కార్డులు చూపమంటే కళ్యాణమండపం నుంచి బయటకురాలేదని, చంద్రబాబు ఒక హిడెన్ ఎజెండాతో ఈ తతంగం నడిపిస్తున్నారని విమర్శించారు. ప్రపంచ రాజధాని అంటున్న చంద్రబాబుకు విశాఖ ఎందుకు గుర్తురాలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం సూటి ప్రశ్న వేశారు. రాజధానికి కావాల్సిన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయన్నారు. ఒకటికి వెయ్యి రెట్లు భూముల రేటు పెంచాలనే ఇన్ సైడర్ ట్రేడ్ చేసి అమరావతిలో రాజధాని పెట్టారని ఆరోపించారు. రాష్ర్టంలో ప్రజలందరికీ, అన్ని వర్గాలకు రాజధాని అందుబాటులో ఉండాలన్నారు. కేవలం ఒక సామాజిక వర్గానికి మేలు చేసేందుకే సెంటర్లీ లొకేటెడ్ అంటున్నారని.. పోనీ అమరావతి కట్టారా అంటే గ్రాఫిక్స్ మాత్రమే చూపించారని ఎద్దేవా చేశారు. శివరామకృష్ణ రిపోర్టు, శ్రీభాగ్ ఒప్పందాలను బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. అమరావతి ప్రాంతం రాజధాని పనికిరాదని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని స్పీకర్ తమ్మినేని గుర్తుచేశారు. శివరామకృష్ణ కమిటీ జగన్ వేసిన కమిటీ కాదని.. కేంద్రప్రభుత్వం వేసిన కమిటీ అన్నారు. బ్యాంకులు దోచిన వారిని, విద్యను వ్యాపారం చేసిన వారిని చంద్రబాబు కమిటీలో వేశారని తమ్మినేని చురకలు అంటించారు. హైదరాబాద్ రాజధానిని ఎందుకు వదిలి అదరా బాదరాగా వచ్చేశారని ప్రశ్నించారు. అమరావతిని మేం రాజధాని కాదనటం లేదని.. కర్నూలు, విశాఖ కుడా అభివృద్ధి చేస్తామని చెబుతున్నామని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ర్యాలీ చేయమని హైకోర్టు అనుమతి ఇస్తే.. తొడలు కొట్టడానికి.. రెచ్చగొట్టడానికి ప్రయత్నించడమేంటని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం సర్వత్రా ఆమోదయోగ్య మన్నారు. ఇక్కడ జరిగిన ఉద్యమాలు ఎవరి కోసం, ఎందుకోసం జరిగాయో అందరికీ తెలుసన్నారు. ఉత్తరాంధ్ర పొరాటంలో నాడు ఎందరో మేథావులు త్యాగాలు చేశారని.. నాడు ఎందరో మహానేతలు చేసిన ప్రాణత్యాగాలకు జగన్ న్యాయం చేయాలనుకుంటున్నారని తమ్మినేని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందితే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. నాడు భుస్వామ్య వ్యవస్థపై తిరగబడిందే సిక్కోల సాయుధ పోరాటం అన్నారు. నాటి పోరాటానికి కారణం పేదరికం , వెనుకుబాటుతనం అని గుర్తుచేశారు. నాయకుడు అంటే ఒక సామాజిక వర్గం కోసం కాదు సమాజం కోసం పనిచేయాలన్నారు. చంద్రబాబు మెకానిజం ఎవరిని మభ్యపెట్టడానికో చెప్పాలన్నారు. పండగ వస్తే ఉత్తరాంధ్ర వాసులు ఎక్కడికో వలస వెళ్లి తిరిగి వస్తుంటారని.. ఎన్నాళ్లు ఈ దుర్ఘతి.. దౌర్భాగ్యం ఉంటాయని.. ఎన్నాళ్లు ఈ అవస్థలు పడాలని తమ్మినేని ప్రశ్నించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)