బీజేపీని అధికారం నుంచి తొలగించాలి

Telugu Lo Computer
0


సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడిగా అఖిలేష్‌ యాదవ్ మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి తొలగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే జాతీయ పార్టీగా ఎస్పీ రాణించేందుకు మద్దతివ్వాలని కోరారు. లక్నోలో గురువారం జరిగిన ఆ పార్టీ జాతీయ సమావేశంలో అఖిలేష్ యాదవ్‌ మాట్లాడారు. 2022 ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎస్పీకి మద్దతుగా ఓటు వేశారని ఆయన తెలిపారు. అయితే ఎన్నికల్లో అవకతవకలు, అధికార యంత్రాంగం దుర్వినియోగం ద్వారా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని బీజేపీ బలవంతంగా లాక్కున్నదని విమర్శించారు. యూపీలో ప్రభుత్వం కోల్పోతే కేంద్రంలో కూడా అధికారం కోల్పోతామని బీజేపీ భయపడిందని, అందుకే అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికల్లో గెలిచిందని అఖిలేష్ యాదవ్‌ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా బీజేపీ బూత్‌ ఇంఛార్జీల పక్షాన నిలిచిందని విమర్శించారు. బీజేపీ ఆదేశాలతో యాదవులు, ముస్లింలకు చెందిన సుమారు 20 వేల ఓట్లను ప్రతి నియోజకవర్గంలో ఈసీ తొలగించిందని ఆరోపించారు. ఓట్ల తొలగింపుపై విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నందున ఉచిత రేషన్‌ పంపిణీని బీజేపీ మరో మూడు నెలలు పొడిగించిందని అఖిలేష్‌ యాదవ్ విమర్శించారు. బడా వ్యాపారులకు భారీ లాభాలు ఇస్తారు కానీ, గ్రామాల్లోని పేదలకు స్ట్రెచర్ లేదా అంబులెన్స్‌ సౌకర్యం కల్పించలేరంటూ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ నేతలు అబద్ధాలకోరులు, ప్రచారం కోసం పాకులాడే వ్యక్తులని ఆయన విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)