కేరళలో అంగన్‌వాడీలకు వైఫై

Telugu Lo Computer
0


కేరళలో అంగన్‌వాడీలు మెరుగైన సేవలందించేందుకు గాను 1,230 గ్రామీణ శిశుసంరక్షణా కేంద్రాలకు వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కోజికోడ్‌ జిల్లాలోని నెల్లికపరంబ్‌లోని అంగన్‌వాడీ కేంద్రానికి వైఫై సౌకర్యాన్ని కల్పించింది. దీంతో రాష్ట్రంలోనే మొట్టమొదటి వైఫై కలిగిన అంగన్‌వాడీ, వైఫై వాడీగా అవతరించింది. శిశు, మహిళ సంక్షేమ శాఖ బిఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మేలో ప్రకటించిన 'వర్ణ కూటు' పథకంలో భాగంగా ఆంగన్‌వాడీలకు వైఫై కనెక్షన్ల కోసం రూ. 30.75 లక్షలు మంజూరు చేసింది. చిన్నారులకు లబ్థి చేకూర్చేందుకు, బాలికలకు సాధికారత కల్పించేందుకు గాను అంగన్‌వాడీలకు వైఫై సౌకర్యం కల్పిస్తోంది. దీనికోసం ఒక్కొక్కరికి రూ. 2500 కేటాయించింది. మరో పైలెట్‌ ప్రాజెక్టులో 210 అత్యాధునిక సదుపాయాలతో కూడిన స్మార్ట్‌ అంగన్‌వాడీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అంగన్‌వాడీలను బిల్డ్‌ అప్‌ ఏరియా, ప్లాట్‌ సైజ్‌ ఆధారంగా ఆరు రకాలుగా వర్గీకరిస్తోంది. పాత భవనాల స్థానంలో దశల వారీగా స్మార్ట్‌ అంగన్‌వాడీలను ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంది. విద్య, వైద్యం సదుపాయాలతో పాటు చిన్నారులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించనుందని.. దీంతో కేరళ రాష్ట్రం చిన్నారుల సంక్షేమ రాష్ట్రంగా మారనుందని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు. జ్ఞానాన్ని పెంపొందించడం, నైపుణ్య ఆధారిత శిక్షణ, సామర్థ్యాన్ని నిర్థారించడం వర్ణకూటు పథకం లక్ష్యమని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు వెళ్లేవారు, ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే విద్యార్థులు కూడా అంగన్‌వాడీల్లో వైఫై సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)