క్లాస్‌ తీసుకొందామని వెళ్లి, క్లాస్‌ వినివచ్చారు !

Telugu Lo Computer
0


అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ సౌదీ అరేబియా పర్యటన అనగానే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనికి కారణం సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌, బైడెన్‌ మధ్య గతంలో దెబ్బతిన్న సంబంధాలే. ఇటీవల జోబైడెన్‌ సౌదీలో అడుగు పెట్టగానే ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంబీఎస్ ఎదురువచ్చారు. వీరిద్దరూ షేక్‌ హ్యాండ్స్‌ ఇచ్చుకోవడానికి బదులు 'ఫిస్ట్‌ బంప్‌'  చేసుకొన్నారు. ఆ తర్వాత రెండున్నర గంటలపాటు వీరి భేటీ జరిగింది. ఈ పర్యటనలో బైడెన్‌ తన సహజ శైలిలో మానవ హక్కుల గురించి యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు చెప్పబోయారు. వాషింగ్టన్‌ పోస్టు కాలమిస్టు జమాల్‌ ఖషోగ్జీ హత్యపై క్లాస్‌ పీకబోయారు. కానీ, సల్మాన్‌ దానికి ధీటుగా జవాబు ఇచ్చారు. ఖషోగ్జీ హత్యతో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అది దురదృష్టకరమైంది, అసహ్యకరమైందని అభివర్ణించారు. ఈ హత్యపై సౌదీ కఠిన చర్యలు తీసుకొందని గుర్తు చేశారు. అదే సమయంలో సౌదీ అరేబియా కూడా ఇస్లామిక్‌ నమ్మకాలకు కట్టుబడి మానవహక్కులకు చాలా విలువ ఇస్తుందని తెలిపారు. ''మీ విలువలను ఎదుటి వారిపై రుద్దాలనుకోవడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు.. ముందు మీరు ఆ విలువలకు కట్టుబడి ఉన్నామని ప్రపంచానికి చూపించండి. మీరు బలవంతంగా వాటిని ఎవరిపై రుద్దలేరు. మా విలువలు మాకుంటాయి.. ఇవి 100 శాతం అమెరికా విలువలను పోలి ఉండవు. ఎందుకంటే మేము మా ఆచారాల పట్ల గర్వపడతాం. సొంత విలువలు.. సొంత నమ్మకాలు ఉంటాయి'' అని ఎంబీఎస్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్‌ ఫైసల్ బిన్‌ సల్మాన్‌ వెల్లడించారు. ఎంబీఎస్‌ మాటల్లో పెద్ద అర్థమే ఉంది. అమెరికా 2003లో ఇరాక్‌ను ఆక్రమించింది. ఆ సమయంలో చాలా మంది ఇరాకీ పౌరులను అబు గహ్రయిబ్‌ జైలులో బంధించింది. 2004లో ఇక్కడ అమెరికా సైనికులు బంధీలను చిత్ర హింసలకు, లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఫొటోలు లీకయ్యాయి. ఈ కేసులో 11 మందిని శిక్షించి అమెరికా చేతులు దులుపుకొంది. మరోవైపు అల్‌జజీరా మహిళా రిపోర్టర్‌ అబు అక్లేహ్‌ మరణానికి ఇజ్రాయెల్‌ తూటా కారణమని ఇటీవల అమెరికా నిపుణుల నివేదికలో తేలింది. ఈ నేపథ్యంలో అమెరికా పేలవమైన స్పందనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలివి..! గతంలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ 2+2 చర్చలకు అమెరికాలో పర్యటిస్తున్న సమయంలో ఇటువంటి అనుభవమే ఎదురైంది. భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘనపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని తిప్పుకొడుతూ భారత విదేశాంగ మంత్రి కూడా అమెరికాలో మానవహక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేసి బ్లింకన్‌కు షాకిచ్చారు. సౌదీ రాజు సల్మాన్‌ అనారోగ్యంతో ఉండటంతో.. యువరాజ్‌ ఎంబీఎస్‌ అనధికారిక రాజుగా వ్యవహరిస్తున్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ, అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్‌ అధికారం చేపట్టగానే సౌదీ యువరాజుతో మాట్లాడేందుకు నిరాకరించారు. కేవలం సౌదీ రాజుతోనే మాట్లాడతానని తేల్చి చెప్పారు. అప్పటికే ఖషోగ్జీ హత్యకు సంబంధించి సౌదీ యువరాజుపై పరోక్షంగా పరుష వ్యాఖ్యలు కూడా చేశారు. యెమన్‌పై సౌదీ చేస్తోన్న యుద్ధానికి అవసరమైన ఆయుధ విక్రయాలు నిలిపివేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టగానే అర్జెంటుగా అమెరికా వైఖరి మారిపోయింది. చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ఉత్పత్తి పెంచాలని కోరేందుకు మార్చిలో శ్వేతసౌధం నుంచి సౌదీ, యూఏఈకి ఫోన్‌కాల్‌ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, అటుపక్క నుంచి సానుకూల స్పందన లేదు. ఇరు దేశాధినేతలు బైడెన్‌తో మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు. అమెరికాలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరగడం మొదలుపెట్టింది. మరికొన్ని రోజుల్లో అమెరికాలో కీలకమైన మిడ్‌టర్మ్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చమురు ధరల స్థిరీకరణకు ప్రయత్నించేందుకు బైడెన్‌ సౌదీకి బయల్దేరారు. ఆయన జూన్‌లో ఈ పర్యటన వివరాలు ప్రకటించగానే 17శాతం చమురు ధరలు తగ్గాయి. కానీ, ఈ పర్యటనలో చమురు ఉత్పత్తి పెంచుతామని సౌదీ నుంచి ఎటువంటి హామీ పొందకుండానే ఆయన అమెరికా తిరుగు పయనం అయ్యారు. మరికొన్ని వారాల్లో సౌదీ చర్యలు తీసుకొంటుందనే అశాభావం మాత్రమే వ్యక్తమైంది. సైబర్‌ సెక్యూరిటీ, క్లీన్‌ ఎనర్జీ అంతరిక్ష రంగం, వైద్యరంగం, కమ్యూనికేషన్లకు సంబంధించి 18 ఒప్పందాలు జరగడం మాత్రమే ఊరట. ఈ పర్యటనతో సౌదీ అరేబియా - ఇజ్రాయెల్‌ మధ్య నేరుగా విమానాలు తిరిగేందుకు అనుమతి లభించింది. సౌదీ జనరల్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ దీనికి సంబంధించి అనుమతులు మంజూరు చేసింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్‌- ఆసియా దేశాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది. ఈ విధంగా ప్రయాణించిన తొలి విమానం అమెరికా అధ్యక్షుడిదే. సౌదీ-ఇజ్రాయెల్‌ సంబంధాలు సాధారణ స్థితికి చేరడానికి ఈ చర్యను తొలిమెట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)