బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టిన అదానీ

Telugu Lo Computer
0


ప్రపంచంలోనే అత్యధిక సంపాదన కలిగిన వారి జాబితాను ఫోర్బ్స్ రియల్ టైమ్ ప్రకటించింది. ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ సంపన్నుడు, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీ దూసుకెళ్తున్నారు. ఏడాదిలోనే రికార్డు స్థాయిలో అతని ఆస్తుల విలువ పెరగడంతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి అదానీ నాలుగో స్థానానికి దూసుకెళ్లారు. ఈ జాబితాలో 230 బిలియన్ డాలర్లతో టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మొదటి స్థానంలో నిలవగా, రెండుమూడు స్థానాల్లో బెర్నార్డ్ ఆర్నాల్డ్, అమెజాన్ అధినేత జెప్ బెజోస్ లు నిలిచారు. నాల్గవ స్థానంలో గౌతమ్ అదాని నిలిచారు. పోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబీకులతో సహా గౌతమ్ అదానీ మొత్తం సంపద దాదాపు 114 బిలియన్ డాలర్లు. గతంలో నాల్గో స్థానంలో మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఉన్నారు. తాజాగా బిల్‌గేట్స్ 20 బిలియన్ డాలర్లను గేట్స్ ఫౌండేషన్‌కు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో ఐదవ స్థానంకు పడిపోయారు. తన విరాళాలను క్రమంగా పెంచుతూ.. కుబేరుల జాబితా నుంచి తాను తప్పుకుంటానని ఇప్పటికే బిల్ గేట్స్ ప్రకటించిన విషయం విధితమే. భారతీయ బిలియనీర్లలో ఒకరైన రియల్స్ అధినేత ముఖేష్ అంబానీ పోర్బ్స్ జాబితాలో 10వ స్థానంకే పరిమితమయ్యారు. ప్రస్తుతం అంబానీ సంపద విలువ 88 బిలియన్ డాలర్లుగా పోర్బ్స్ అంచనా వేసింది. ఈ ఏడాది ప్రారంభం వరకు ఆసియలో అత్యధిక ఆస్తులు కలిగిన వారి జాబితాలో ముఖేశ్ అంబానీ తొలిస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ స్థానాన్ని గౌతమ్ అదానీ ఆక్రమించిన విషయం విధితమే. 2021 – 22 మధ్య కాలంలో అదానీ నికర విలువ 50 బిలియన్ డాలర్ల నుంచి 90 బిలియన్లకు పెరిగింది. దీంతో ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో సంపద వృద్ధి చేసుకున్న వ్యక్తిగానూ గౌతమ్ అదానీ రికార్డు సృష్టించారు. అదానీ గ్రూప్ వ్యాపారాలు ఎనర్జీ, పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్, మైనింగ్ అండ్ రిసోర్సెస్, గ్యాస్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఎయిర్‌పోర్ట్‌లలో విస్తరించి ఉన్నాయి. వీటి మొత్తం కలిపి 197.49 బిలియన్ డాలర్లు (జూలై 19, 2022 నాటికి) మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో పబ్లిక్‌గా జాబితా చేయబడిన ఏడు సంస్థలతో ఏర్పాటు చేయబడింది. దాని ప్రతి వ్యాపార రంగాలలో గ్రూప్ భారతదేశంలో నాయకత్వ స్థానాన్ని ఏర్పరచుకుందని దాని అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)